యాచించి ఒకరు.. గాజులు అమ్మి మరొకరు..

22 Feb, 2019 11:55 IST|Sakshi

జైపూర్‌/లక్నో: పుల్వామా ఉగ్రదాడి ఘటనపై యావత్తు దేశం కదిలిపోయింది. ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడమేకాకుండా.. అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారు. ధనిక-పేద, చిన్న-పెద్ద తేడా లేకుండా పలువురు తమకు తోచిన సాయం చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని భూపాల్‌కి చెందిన 11 ఏళ్ళ చిన్నారి ముష్కాన్‌, తాను పొదుపు చేసిన మొత్తాన్ని అమర జవాన్ల కోసం ఏర్పాటు చేసిన సహాయ నిధికి అందజేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యాచకురాలు, స్కూల్‌ ప్రిన్సిపాల్‌ తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఒకరు తాను యాచించిన సొమ్మును మరణాంతరం కూడా మంచి పనికి వాడేందుకు ఉపయోగించాలని తపనపడగా, యూపీకి చెందిన స్కూల్‌ ప్రిన్సిపాల్‌ తన బంగారు గాజులు అమ్మి తనవంతు సాయం చేశారు.

ఆమె యాచకురాలు అయితే ఏమీ ఔదార్యం తక్కువేమీ కాదు... చీదరింపులు, ఛీత్కారాలు ఎదుర్కొంటూ ఎండకు ఎండి, వానకు తడుస్తూ...ఒక్కో రూపాయి కూడబెట్టింది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు నందినీ శర్మ తాను యాచించి సంపాదించిన సుమారు రూ.6 లక్షల సొమ్మును  బ్యాంక్‌లో వేసింది. తన మరణాంతరం ఆ సొమ్ముకు ఇద్దరు వ్యక్తులను నామినీలుగా పేర్కొంది. గత ఏడాది ఆగస్ట్‌లో నందినీ శర్మ మరణించింది. అయితే తాను సంపాదించిన సొమ్ము మంచి పని కోసం వెచ్చించాలని ఆకాంక్షించింది. అయితే నందినీ శర్మ నామినీలుగా నియమించిన వ్యక్తులు ఆమె చెప్పినట్టుగా ఆ డబ్బును ఓ మంచి పని కోసం వాడాలని ఎదురుచూస్తున్నారు. గతవారం జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు ఆ మొత్తాన్ని అందించాలని నిర్ణయానికి వచ్చిన వారు ఆ డ్రాఫ్ట్‌ను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. 

కిరణ్‌ జాగ్వల్‌.. ఉత్తరప్రదేశ్‌లోని బారెల్లీకి చెందిన కిరణ్‌ జాగ్వల్‌.. ఓ సాధారణ స్కూల్‌ ప్రిన్సిపల్‌. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాల పరిస్థితి చూసి చలించిపోయిన కిరణ్‌.. వారికి సాయం చేయడానికి ముందుకొచ్చారు. అందుకోసం తన తండ్రి కానుకగా ఇచ్చిన గాజులను అమ్మేశారు. అలా వచ్చిన 1.5 లక్షల రూపాయలను ప్రధాన మంత్రి రిలీఫ్‌ ఫండ్‌కు అందజేశారు. అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. పిబ్రవరి 14వ తేదీన పుల్వామా జైషే మహమ్మద్‌ ఉగ్రసంస్థ జరిపిన ఆత్మహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు