మూడు రోజులుగా పోలీస్ స్టేషన్‌లోనే ఆ బాలిక

15 Apr, 2016 11:47 IST|Sakshi
మూడు రోజులుగా పోలీస్ స్టేషన్‌లోనే ఆ బాలిక

శ్రీనగర్: కశ్మీర్‌లోని హంద్వారాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆందోళనలకు కేంద్రబిందువు అయిన బాలికను మూడు రోజులుగా పోలీసులు ఇంటికి పంపించడంలేదు. దీంతో ఆ బాలికను ఇంటికి పంపించాలంటూ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన బాలిక తండ్రిని కూడా గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాలికను జవాను వేధించాడని పుకార్లు రావడంతో మంగళవారం అల్లర్లు ప్రారంభమయిన విషయం తెలిసిందే. అయితే సదరు బాలిక తనపై వేధింపులకు పాల్పడింది జవాను కాదని స్థానికుడే అని వివరణ ఇచ్చిన వీడియోను ఆర్మీ అధికారులు తర్వాత విడుదల చేశారు. ఆ వీడియోను పోలీసు స్టేషన్‌లోనే తీయగా, మాట్లాడాలంటూ విజ్ఞప్తి చేస్తున్న ఒక పురుషుని గొంతు వినిపించింది. తదనంతరం జరుగుతున్న పరిణామాలతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.  

బాలిక, ఆమె తండ్రిని భద్రతా కారణాల దృష్ట్యా వారి కోరిక మేరకే తమ సంరక్షణలో ఉంచామని పోలీసులు తెలిపారు. పోలీసులు బాలిక ఇంట్లోనే రక్షణ కల్పించాలి, కానీ పోలీసు స్టేషన్‌లో కాదని జమ్ము-కశ్మీర్‌కు చెందిన సమాజిక కార్యకర్త ఖుర్రం పర్వేజ్ అన్నారు. బాలిక సంరక్షకులు పక్కన లేకుండానే వీడియోను చిత్రీకరించడం చట్టవిరుద్ధమని ఖుర్రం పర్వేజ్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు