కేరళలో తెరుచుకున్న స్కూళ్లు, కాలేజీలు

30 Aug, 2018 03:29 IST|Sakshi

తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళలో దాదాపు 15 రోజుల తర్వాత పాఠశాలలు, కళాశాలలు మళ్లీ తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులను టీచర్లు పాటలు పాడుతూ ఆహ్వానించారు. పుస్తకాలు, యూనిఫాం నాశనమయ్యాయన్న బాధను పోగొట్టేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి స్వీట్లను అందజేశారు. ఈ విషయమై కేరళ విద్యా శాఖ మంత్రి ప్రొఫెసర్‌ సి.రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ.. వరదల కారణంగా రాష్ట్రంలో 600 పైచిలుకు పాఠశాలలు దెబ్బతిన్నాయని తెలిపారు.

ఇంకా 1.97 లక్షల మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న నేపథ్యంలో కొన్నిచోట్ల పాఠశాలలు తెరుచుకోలేదని వెల్లడించారు. సెప్టెంబర్‌ 3 నాటికి అన్ని పాఠశాలలు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరదతో మానసికంగా కుంగిపోయిన పిల్లలందరికీ కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు తెలిపారు. యూనిఫామ్, పుస్తకాలు కోల్పోయిన పిల్లలు బాధ పడొద్దనీ, ప్రభుత్వం కొత్తవి అందజేస్తుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు