సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి అరకొర నిధులే..

2 Feb, 2018 02:40 IST|Sakshi
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

ఆధునిక సాంకేతికతను వినియోగించే దేశంగానే భారత్‌ మిగిలిపోకూడదు.. సొంతంగా టెక్నాలజీని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలి’’ అని ఆర్థిక సర్వేలో ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించింది. అయితే కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో మాత్రం అది అంతగా ప్రతిఫలించలేదు. కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌ రంగాల్లో పరిశోధనల కోసం అత్యున్నత స్థాయి నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించడం కొంత సానుకూల పరిణామం. అలాగే బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ వినియోగంపైనా ఆర్థిక మంత్రి ఆసక్తి కనబరిచారు. బిట్‌ కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీ నిర్వహణలో బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఈ టెక్నాలజీతో లావాదేవీల నిర్వహణలో అవినీతి, అక్రమాల్ని పూర్తిస్థాయిలో అడ్డుకోగలమని కేంద్రం భావిస్తోంది. బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ అంటే.. ‘అన్ని లావాదేవీలను నమోదు చేసేందుకు ఉపయోగపడే ఒక పద్దుల పుస్తకం. ఇది ఒకే చోట కాకుండా.. నెట్‌వర్క్‌లో ఎన్ని కంప్యూటర్లు ఉంటాయో అన్నింటిలోనూ రహస్య సంకేత భాషలో నిక్షిప్తమై ఉంటుంది. అందరూ అనుమతిస్తేగానీ ఈ పద్దుల పుస్తకంలో చిన్న మార్పైనా చేయడం సాధ్యం కాదు. ఎవరైనా చేయాలనుకుంటే వెంటనే అందరికీ తెలిసిపోతుంది’. ప్రభుత్వ పథకాల అమలులో ఈ టెక్నాలజీని వినియోగించాలన్నదే కేంద్రం భావన.

1.5 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం
ఇక దేశంలో జనాభా కంటే ఎక్కువ మొబైల్స్‌ అందుబాటులో ఉన్నా.. ఇంటర్నెట్‌ విషయంలో గ్రామీణ భారతం ఎంతో వెనుకంజలో ఉంది. ఈ లోటు భర్తీకి నేషనల్‌ నాలెడ్జ్‌ సెట్‌వర్క్‌ పేరుతో గ్రామ పంచాయతీల్ని అనుసంధానించే ప్రాజెక్టును గత ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే లక్ష గ్రామ పంచాయతీల్ని అనుసంధానించినట్లు ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన 1.5 లక్షల గ్రామాల్ని శరవేగంగా భారత్‌ నెట్‌లోకి చేర్చే చర్యలు ముమ్మరం చేస్తామని ఈ బడ్జెట్‌లో ప్రకటించడం ఆహ్వానించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ కనెక్టివిటీ పెంచేందుకు ఐదు లక్షల వైఫై హాట్‌స్పాట్ల ఏర్పాటు ప్రకటన, డిజిటల్‌ ఇండియా పథకానికి కేటాయింపులు రెట్టింపు చేయడం, 5జీ మొబైల్‌ టెక్నాలజీ పరీక్షలకు చెన్నై ఐఐటీలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వంటివి శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన ఇతర ముఖ్యాంశాలు. మొదటి నుంచి భారతదేశంలో పరిశోధనలకు బడ్జెట్‌లో కేటాయింపులు నామమాత్రమే.. స్థూల జాతీయోత్పత్తిలో కనీసం ఒక్క శాతం నిధుల్ని పరిశోధనలకు కేటాయించాలని శాస్త్రవేత్తలు చాలాకాలంగా కోరుతున్నారు. అమెరికా, చైనా వంటి దేశాల్లో స్థూల జాతీయోత్పత్తిలో మూడు నుంచి నాలుగు శాతం నిధులు శాస్త్ర, సాంకేతిక రంగాలకు కేటాయిస్తుండగా.. మన వద్ద అవి అరశాతం దాటకపోవడం గమనార్హం.  
– సాక్షి, హైదరాబాద్‌ 

>
మరిన్ని వార్తలు