రెండో వివాహం చెల్లుతుంది : సుప్రీంకోర్టు

27 Aug, 2018 02:36 IST|Sakshi

విడాకుల పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నా ఫర్వాలేదు

భార్యాభర్తలు సమస్య పరిష్కరించుకుంటే చాలు: సుప్రీంకోర్టు

ఢిల్లీ హైకోర్టు తీర్పు కొట్టివేత

న్యూఢిల్లీ: విడాకుల పిటిషన్‌ కోర్టులో అపరిష్కృతంగా ఉన్న సమయంలో జరిగిన రెండో వివాహం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. హిందూ వివాహ చట్టంలోని ‘వివాహ అనర్హత’ నిబంధన ద్వారా రెండో వివాహాన్ని రద్దుచేయలేమని జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావుల ధర్మాసనం తెలిపింది. విడాకుల పిటిషన్‌ పరిష్కృతమయ్యే వరకు రెండో వివాహంపై ఆంక్షలు విధించిన హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 15ను ఈ సందర్భంగా బెంచ్‌ ప్రస్తావించింది. ఇరు వర్గాలు(భార్యాభర్తలు) కోర్టు బయట సమస్యను పరిష్కరించుకుని, ఇక కేసును కొనసాగించొద్దని నిర్ణయించుకున్న సందర్భంలో సెక్షన్‌ 15 వర్తించదని తెలిపింది.

విడాకుల పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా జరిగిన వివాహం చెల్లదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. తన భార్యతో విడాకులు కోరుతూ దాఖలుచేసిన పిటిషన్‌ ఢిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న సమయంలోనే పిటిషన్‌దారుడు మరో వివాహం చేసుకున్నారు. తొలి భార్యతో సమస్యను పరిష్కరించుకున్నానని, తమ విడాకులకు అనుమతివ్వాలని కోర్టు కు విజ్ఞప్తి చేశారు. తన అప్పీల్‌ను వెనక్కి తీసుకోవడానికి అనుమతించాలని కోరారు. కానీ, విడాకుల పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా జరిగిన వివాహం చెల్లబోదని హైకోర్టు తీర్పునివ్వడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘హిందూ వివాహ చట్టం సామాజిక సంక్షేమానికి ఉద్దేశించిన, ఉదారవాద చట్టం. ఈ చట్టం అసలు లక్ష్యం చాటేలా భాష్యం చెప్పాల్సి ఉంది’ అని బెంచ్‌ పేర్కొంది.

చట్టంలో ఏముందంటే..
∙సెక్షన్‌ 5(1): జీవిత భాగస్వామి బతికి ఉండగా మరో వివాహం చేసుకోరాదు
∙సెక్షన్‌ 11: అలాంటి వివాహాలు చెల్లుబాటు కావు
∙సెక్షన్‌ 15: విడాకులు పొందిన వారు మళ్లీ ఎప్పుడు వివాహం చేసుకోవాలో చెబుతుంది 

మరిన్ని వార్తలు