నిబంధనలకు విరుద్ధం; భారీ కాంప్లెక్స్‌ల కూల్చివేత

11 Jan, 2020 11:07 IST|Sakshi

తిరువనంతపురం: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని కేరళలోని భారీ కాంప్లెక్స్‌లను శనివారం అధికారులు కూల్చేయనున్నారు. కొచ్చిలోని మారడు ప్రాంతంలో ఉన్న కాంప్లెక్స్‌లను కూల్చి వేయాలని ఎర్నాకులం జిల్లా న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కాంప్లెక్స్‌లో మొత్తం 343 ప్లాట్లు, 240 కుంటుంబాలు ఉంటున్నాయి. శనివారం, ఆదివారం రెండు రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూల్చివేత పనులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చుట్టు పక్కల ప్రాంతంలో పోలీసులు సెక్షన్‌ 144ను అమలు చేశారు. 

నిబంధనలను ఉల్లంఘిస్తూ చేపట్టిన నిర్మాణాలు చట్ట విరుద్ధమని 138 రోజుల్లోగా కాంప్లెక్స్‌లను కూల్చివేయాలని సుప్రీంకోర్టు 2019 సెప్టెంబర్‌లో ఆదేశించింది. తీర ప్రాంతంలో కట్టినందుకు నెలలోపు తొలగించాలని గత ఏడాది మే 8న సుప్రీంకోర్టు ఆదేశించింది. త్రిసభ్య కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. కాంప్లెక్స్‌ నివాసితులు మొదట ఖాళీ చేయడానికి నిరాకరించినా అనేక నిరసనల అనంతరం రాజీకి వచ్చారు. ఫ్లాట్ల యజమానులకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

ఇక కాంప్లెక్స్‌ కూల్చివేతకు అన్ని ఏర్పాట్లు చేశామని పోలీసులు తెలిపారు. కాంప్లెక్స్‌ల నుంచి ప్రజలను వేరే ప్రాంతానికి తరలించడంతోపాటు పరిసరాల ప్రజలను కూడా ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించారు. రహదారుల నుంచి పోలీసులు బారికేడ్లను తొలగించిన తర్వాత ప్రజలు తమ ఇళ్లకు తిరిగి రావచ్చని పోలీసులు తెలిపారు. పరిసర ప్రాంతాల్లో డ్రోన్‌లను ఉపయోగించరాదని కొచ్చి పోలీస్‌ కమిషనర్‌ హెచ్చరించారు. భవనాల్లో బుధవారం పేలుడు పదార్థాలు ఉంచామని పేర్కొన్నారు. చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి నష్టం జరగకుండా కూల్చివేత సురక్షితంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే సంఘటన ప్రాంతంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయగా.. ఈ ప్రక్రియను మొత్తం నిర్వహించడానికి 800 మంది సిబ్బందిని నియమించారు.

మరిన్ని వార్తలు