‘స్వచ్ఛ’ సికింద్రాబాద్‌

18 May, 2017 02:02 IST|Sakshi
‘స్వచ్ఛ’ సికింద్రాబాద్‌

- దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో రెండో స్థానం
- విశాఖకు టాప్, విజయవాడకు నాలుగో స్థానం
- ఏృ కేటగిరీ స్టేషన్లలో ఖమ్మం, మంచిర్యాల, వరంగల్‌

సాక్షి, న్యూఢిల్లీ:
దేశంలోనే స్వచ్ఛ రైల్వేస్టేషన్‌గా విశాఖపట్నం స్టేషన్‌ గుర్తింపు పొందింది. తర్వాతి స్థానంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నిలిచింది. విజయవాడ రైల్వే స్టేషన్‌కు నాలుగో స్థానం లభించింది.  దేశంలో రద్దీ తీవ్రంగా ఉండే దాదాపు 75 రైల్వే స్టేషన్లలో స్వచ్ఛతపై థర్డ్‌ పార్టీ రూపొందించిన ఆడిట్‌ నివేదికను కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు బుధవారం ఢిల్లీలో విడుదల చేశారు. దీంతో పాటు స్వచ్ఛ రైల్‌ పోర్టల్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. పార్కింగ్‌ ప్రాంతం, ప్రధాన ప్రవేశ ప్రాంతం, ప్రధాన ప్లాట్‌ఫాం, వేచి ఉండే గది, ప్రయాణికుల స్పందన, తదితర పరిమితుల ఆధారంగా ఈ ఆడిట్‌ను నిర్వహించారు.

ఇందులో అత్యంత స్వచ్ఛత పాటిస్తున్న ఏృ1 కేటగిరీ స్టేషన్లలో తొలి 10 స్థానాల్లో వరుసగా విశాఖ, సికింద్రాబాద్, జమ్ముతావి, విజయవాడ, ఆనంద్‌ విహార్‌ టర్మినల్, లక్నో, అహ్మదాబాద్, జైపూర్, పుణే, బెంగళూరు సిటీ స్టేషన్లు నిలిచాయి. అలాగే ఏృకేటగిరీ స్టేషన్ల జాబితాలో బియాస్, ఖమ్మం, అహ్మద్‌నగర్, దుర్గాపూర్, మంచిర్యాల, బద్నెర, రంగ్‌ ఇయా జంక్షన్, వరంగల్, దమో, భుజ్‌ టాప్‌ టెన్‌ ర్యాంకులు సాధించాయి. రైల్వే జోన్ల విభాగంలో ఆగ్నేయ మధ్య రైల్వే, తూర్పుకోస్తా రైల్వే, సెంట్రల్‌ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే, పశ్చిమ రైల్వే, నైరుతి రైల్వే, ఈశాన్య రైల్వే, వాయవ్య రైల్వే, దక్షిణ రైల్వే, ఉత్తర ఫ్రాంటియర్‌ రైల్వేలు తొలి పది ర్యాంకులు కైవసం చేసుకున్నాయి. కాగా ఏృ1 కేటగిరీ స్టేషన్లలో గడిచిన ఏడాదిలో స్వచ్ఛత విషయంలో గణనీయమైన వృద్ధి సాధించిన విషయంలో విశాఖ, విజయవాడ రైల్వేస్టేషన్లు ఉండగా ఏృకేటగిరీ స్టేషన్లలో ఖమ్మం, వరంగల్, అనంతపురం ఉన్నాయి.

మరిన్ని వార్తలు