ఇరోం షర్మిల భద్రత కట్టుదిట్టం

11 Aug, 2016 08:41 IST|Sakshi
ఇరోం షర్మిల భద్రత కట్టుదిట్టం

ఆస్పత్రిలో ఇంకా ద్రవాహారమే..

ఇంఫాల్ : మణిపూర్‌లో సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దుచేయాలంటూ 16 ఏళ్లు నిరాహార దీక్ష చేసి మంగళవారం దీక్ష విరమించిన మణిపూర్ ఉక్కుమహిళ ఇరోం షర్మిల ఇంఫాల్‌లోని ఆస్పత్రిలో కట్టదిట్టమైన పోలీసుల భద్రత మధ్య గడుపుతున్నారు. దీక్ష విరమణను కొన్ని సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో ఆస్పత్రి వద్ద సాయుధ పోలీసు బలగాను మోహరించారు.

షర్మిల ప్రస్తుతం ఇక్కడి జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు.  ఏళ్లపాటు  నిరశన  కొనసాగినందువల్ల శరీరం ఒక్కసారిగా ఘన ఆహారానికి మారే పరిస్థితి లేదని, ప్రస్తుతానికి ప్రత్యేక ద్రవాహారాన్ని అందజేస్తున్నామని వైద్యులు చెప్పారు. దీక్షను విరమించినప్పటికీ సైనికచట్టం రద్దు చేసేవరకూ గోళ్లను కత్తిరించుకోరాదన్న, తల దువ్వుకోరాదన్న, ఇంటికెళ్లి తన తల్లిని కలుసుకోరాదన్న నిర్ణయాన్ని ఆమె కొనసాగిస్తున్నారు.

 దృఢ సంకల్పం, యోగా సాధన
16 ఏళ్ల నిరహార దీక్ష చేసినప్పటికీ షర్మిల ఆరోగ్యం దాదాపు నిలకడగానే ఉండటానికి కారణం తెలిసింది. దృఢ సంకల్పం, నిత్య యోగా సాధన అలవాటే ఆమె ఇంతకాలం జీవించడానికిగల కారణమని షర్మిల సోదరుడు సింఘాజిత్ చెప్పారు. దీక్షకు దిగే రెండేళ్ల ముందే (1998లో) షర్మిల యోగా నేర్చుకున్నట్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు  తెలిపారు. ప్రకృతి చికిత్సపై మక్కువతో షర్మిల ఆ కోర్సును ఎంపిక చేసుకోగా అందులో యోగాభ్యాసం కూడా ఉన్నట్లు వివరించారు.

>
మరిన్ని వార్తలు