బట్టలన్నీ విప్పేసి, కాళ్లు, చేతులు కట్టేసి..

16 Sep, 2019 19:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘మమ్మల్ని రాత్రి పూట ఇళ్ల నుంచి బయటకు తీసుకెళ్లారు. తీవ్రంగా కొట్టారు. శరీరమంతటా ఎలక్ట్రిక్‌ షాక్‌లు ఇచ్చారు’ అని కొంత మంది గ్రామస్తులు ఆరోపించగా, ‘రాత్రిపూట సైనిక శిబిరాల నుంచి ప్రజలు అరుపులు, ఏడ్పులు రోజూ వినిపించేవి’ మరికొంత మంది  తెలిపారు. ‘ఆగస్టు 14వ తేదీన రాత్రిపూట సైనికులు మా ఇళ్లు తలుపు తట్టారు. నేను తలుపులు తీశాను. పది మంది సైనికులు ఇంట్లో జొరబడ్డారు. నాకు, నా సోదరుడి కళ్లకు గంతలు గట్టి బయటకు తీసుకెళ్లారు. ముందుగా రోడ్డవతలికి నా సోదరుడిని తీసుకెళ్లారు. అక్కడ అతడిరి తీవ్రంగా కొడుతుండడంతో హృదయ విదారకమైన ఏడుపు వినిపించింది. నన్ను సమీపంలోని చౌగామ్‌ సైనిక శిబిరానికి తీసుకెళ్లారు. అక్కడ బట్టలన్నీ విప్పేశారు. చేతులను, కాళ్లను కట్టేసి ఇనుప రాడ్లతో కొట్టారు. చేతులు, కాళ్లు, వీపు, పిర్రలపై ఎలక్ట్రిక్‌ షాక్‌లు ఇచ్చారు’ 26 ఏళ్ల అబిద్‌ ఖాన్‌ ‘ఏపీ’ వార్తా సంస్థకు వివరించారు. సోఫియాన్‌ జిల్లా హిర్పోరా గ్రామంలో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. 

‘నీ పెళ్లికి హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌’ మిలిటెంట్‌ సంస్థకు చెందిన రియాజ్‌ నైకూ మిలిటెంట్‌ను  ఎందుకు ఆహ్వానించావు ? ఇప్పుడు అతనెక్కడున్నాడో చెప్పు ?’ అంటూ భారత సైనికులు తనను హింసించారని, అతను ఎవరో, అసలు ఎక్కడుంటారో కూడా తనకు తెలియదని ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదని అబిద్‌ ఖాన్‌ మీడియాకు వివరించారు. తన పురుషాంగం, వరి బీజాలపై కూడా ఎలక్ట్రిక్‌ షాక్‌ ఇచ్చారని తెలిపాడు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేసిన నేపథ్యంలో మున్ముందు ఎలాంటి నిరసన ప్రదర్శనలు జరపరాదనే ఉద్దేశంతోనే వారు ఇలా తనను హింసిస్తున్నారని అర్ధం అయిందని ఆయన చెప్పారు. తన లాగే తన గ్రామానికి చెందిన మరికొంత మంది యువకులను ఇలాగే హింసించినట్లు తెల్సిందని చెప్పాడు. 

సైనిక శిబిరం నుంచి అబద్‌ ఖాన్‌ విడులయ్యాక పది రోజుల పాటు నిల్చోలేక పోయాడు, కూర్చోలేక పోయాడని, ఆ పది రోజులు వరుసగా వాంతులు చేసుకుంటూనే ఉన్నాడని, బ్రతుకుతాడని ఆశ లేకుండేనని కుటుంబ సభ్యులు తెలిపారు. 20 రోజుల తర్వాత తేరుకొని కాస్త అటు, ఇటు నడవ కలుగుతున్నాడని వారు చెప్పారు. పలు గ్రామాల్లో జరుగుతున్న ఇలాంటి మానవ హక్కుల ఉల్లంఘన సంఘటనలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. కశ్మీర్‌లో ఎప్పుడో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ నేటికి సాధారణ పరిస్థితులు లేవని ఏపీ మీడియా వెల్లడించింది. ఇంకా పలు ప్రాంతాల్లో టెలిఫోన్‌ సౌకర్యాలను కూడా పునరుద్ధరించలేదు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా