ఉగ్రమూకల టార్గెట్‌ పం‍ద్రాగస్ట్‌

5 Aug, 2018 16:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదుల నుంచి దాడుల ముప్పు పొంచిఉందన్న ఇంటెలిజెన్స్‌ వర్గాల హెచ్చరికతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. జైషే మహ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజార్‌ సోదరుడు అబ్దుల్‌ రౌఫ్‌ అస్గర్‌ మాజీ బాడీ గార్డ్‌ మహ్మద్‌ ఇబ్రహీం దాడిని చేపట్టేందుకు ఢిల్లీలో ఉన్నట్టు కేం‍ద్ర నిఘా వర్గాలు భద్రతా దళాలకు సమాచారం అందించాయి. ఇబ్రహీంతో పాటు జైషే కేడర్‌ గురించి కూడా ఇంటెలిజెన్స్‌ వర్గాలు కీలక సమాచారం చేరవేశాయి.

మే తొలివారంలో తొలుత జమ్మూ కశ్మీర్‌లో ప్రవేశించిన ఇబ్రహీం ప్రస్తుతం ఢిల్లీకి చేరుకుని ఆ ప్రాంతంలోని జైషే శ్రేణులతో దాడులతో విరుచుకుపడేందుకు ధ్వంసరచనకు పూనుకున్నాడని నిఘా వర్గాలు హెచ్చరించాయి. జైషే సీనియర్‌ సభ్యుడు ఉమర్‌ సైతం 72వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా దేశ రాజధానిలో విధ్వంసం సృష్టించేందుకు అవసరమైన రవాణా సదుపాయాలను సమకూర్చుతున్నట్టు నిఘా వర్గాలు భద్రతా దళాలకు సమాచారం అందించాయి.

పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ సహకారంతో మొత్తం ఆపరేషన్‌ను మసూద్‌ అజర్‌ డిప్యూటీ, భారత వ్యతిరేక కార్యకలాపల ఆపరేషనల్‌ కమాండర్‌ అస్గర్‌ పర్యవేక్షిస్తున్నాడు. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో అలజడి సృష్టించేందుకు భారత భూభాగంలోకి 600 మంది ఉగ్రవాదులను పంపేందుకు పాక్‌ సైన్యం సిద్ధంగా ఉందని ఓ నివేదిక వెల్లడైన క్రమంలో నిఘా వర్గాల తాజా హెచ్చరికతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

>
మరిన్ని వార్తలు