కశ్మీర్‌లో 13 మంది ఉగ్రవాదుల హతం..

1 Apr, 2018 19:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మిలిటెంట్ల చేతిలోబందీలుగా పౌరులు

కశ్మీర్‌ : అల్లర్లు, ఘర్షణలతో కశ్మీర్‌ అట్టుడుకుతోంది. ఆదివారం భద్రతాదళాలు, ఉగ్రమూకల నడుమ పలుమార్లు జరిగిన కాల్పుల్లో 13 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఇదే సమయంలో ఉగ్రమూకలతో పోరాడుతూ ముగ్గరు జవాన్లు అమరులయ్యారు. తీవ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయనే విషయం తెలియడంతో దక్షిణ కశ్మీర్‌లో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వడంతో ప్రతిగా బలగాలు వారిపైకి కాల్పులకు దిగాయని కశ్మీర్‌ డీజీపీ వాయిద్‌ పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.  

ఉగ్ర సంస్థల్లోకి యువత..
మృతి చెందిన 13 మంది మిలిటెంట్లలో ఒక తీవ్రవాద సంస్థకు చెందిన ముఖ్య నాయకుడు ఉన్నాడని వాయిద్‌  తెలిపారు. అనంత్‌నాగ్‌ నుంచి 12 మంది, షోపియాన్‌ నుంచి 24 మంది, పుల్వామా, అవంతిపుర నుంచి 45 మంది, కుల్గాం నుంచి 10 మంది యువకులు ఇటీవల మిలిటెంట్‌ గ్రూపుల్లో చేరినట్లు సమాచారముందని ఆయన పేర్కొన్నారు. 

ఒకరి లొంగుబాటు..
అనంత్‌నాగ్‌ జిల్లాలోని దాయిల్గాంలో ఇంట్లో నక్కిన ఇద్దరు తీవ్రవాదులకు లొంగిపోవాలని లౌడ్‌ స్పీకర్లతో హెచ్చరికలు చేసినట్లు డీజీపీ తెలిపారు. అయితే కుటుంబ సభ్యుల వినతితో ఒక మిలిటెంట్‌ లొంగిపోగా.. మరో తీవ్రవాది రావూఫ్‌ ఖాండే కాల్పుల్లో హతమయ్యాడని  డీజీపీ వెల్లడించారు. ఏడాదిగా జాడలేకుండా పోయిన రావూఫ్‌ ఖాండే వారం క్రితం తుపాకి చేతబట్టి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ ఇద్దరూ నిషేదిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌(హెచ్‌ఎమ్‌)కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. 

బందీలుగా పౌరులు..
షోపియాన్‌ జిల్లాలోని కచ్చదూరలో మిలిటెంట్లు కొంతమంది పౌరులను బందీలుగా పట్టుకున్నారని డీజీపీ తెలిపారు. వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నామనీ, భద్రతా బలగాలకు, తీవ్రవాదులకు ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. కశ్మీర్‌‌ లోయలో లా అండ్‌ ఆర్డర్‌ అదుపులోకి తీసుకురావడానికి మరిన్ని భద్రతా బలగాలను మోహరించామన్నారు. చనిపోయిన తీవ్రవాదులు ఏ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారో తెలియాల్సి ఉందని డీజీపీ వెల్లడించారు.

మరిన్ని వార్తలు