దిగ్విజయ్ నివాసాన్ని ముట్టడించిన సీమాంధ్ర ఉద్యోగులు

28 Aug, 2013 16:38 IST|Sakshi
దిగ్విజయ్ నివాసాన్ని ముట్టడించిన సీమాంధ్ర ఉద్యోగులు

ఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్‌ వ్యాఖ్యలపై సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు మండిపడ్డారు.తెలంగాణ ఏర్పాటు విషయంలో ఇక ఎటువంటి మార్పులు ఉండవని దిగ్విజయ్ ప్రకటించడంతో సీమాంధ్ర ఉద్యోగులు బుధవారం దిగ్విజయ్ సింగ్ నివాసం వద్దే ధర్నాకు దిగారు.  జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంలో ఎటువంటి మార్పులేవన్న ఆయన వ్యాఖ్యలను సీమాంధ్ర ఉద్యోగులు ఖండించారు. ఇప్పటికే తెలంగాణపై నిర్ణయం జరిగిపోయినందున ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవన్న ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సీమాంధ్ర ఉద్యగోలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యుత్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

 

మంగళవారం రాత్రి ఇక్కడ ఆంటోనీ కమిటీతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యుల సమావేశం ముగిసిన తర్వాత దిగ్విజయ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. గత రెండేళ్లుగా సాగించిన విస్త­ృతస్థాయి సంప్రదింపులు, అన్ని రాజకీయ పార్టీల అంగీకారం తర్వాతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం తీసుకుందని పునరుద్ఘాటించారు. అయితే, తొలుత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించిన టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు మాటపై నిలబడకుండా వెనక్కు తగ్గుతున్నాయని ఆయన ఆరోపించారు.

 

తమను సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా, హడావుడిగా నిర్ణయం తీసుకొన్నదని బీజేపీ సీనియర్ నేత అద్వానీ వ్యాఖ్యానించినట్లు మీడియాలో చూశానన్న దిగ్విజయ్... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ రాసిన లేఖను అద్వానీ ఎందుకు పరిగణనలోకి  తీసుకోరని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు