లాక్‌డౌన్ ఉల్లంఘ‌న‌: సెల్ఫీ దిగండి

16 Apr, 2020 11:19 IST|Sakshi

కొల్లాపూర్‌: ఇళ్ల‌లోనే ఉండండి- క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టండి అంటూ ప్ర‌భుత్వాలు ఎంత చెప్పినా కొంత‌మంది చెవికెక్కించుకోవ‌ట్లేదు. అయితే, తాడిని త‌న్నేవాడుంటే వాడి త‌ల‌దన్నేవాడు ఇంకొక‌డుంటాడు అని ఓ సామెత‌. ఇలా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హరించేవారికి త‌గిన బుద్ధి చెప్పేందుకు పోలీసులు ఓ వినూత్న ఆలోచన చేశారు. తాము త‌ప్పు చేశామ‌ని వారితో చెప్ప‌క‌నే చెప్పించారు. ఇది అంద‌రికీ తెలిసేలా వారి ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ గుణ‌పాఠం నేర్పుతున్నారు. ఇలా పోలీసులు వింత శిక్ష విధిస్తున్న‌‌ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని కొల్లాపూర్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. కొల్లాపూర్‌లో లాక్‌డౌన్ ముగిసేవ‌ర‌కు అత్య‌వ‌స‌ర ప‌ని మిన‌హా మిగ‌తా దేనికీ బ‌య‌ట‌కు రావ‌ద్ద‌న్న నిబంధ‌న‌ల‌ను కొంద‌రు బేఖాత‌రు చేస్తున్నారు. (ఏఎస్‌ఐ చేయి నరికేశారు!)

ఈ లిస్టులో చ‌దువు‌కున్న యువ‌త‌, టీచ‌ర్లు, ఉద్యోగులు ముందు వ‌రుస‌లో ఉన్నారు. దీంతో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన వారితో పోలీసులు సెల్ఫీ తీయించారు. ఓస్.. అంతే క‌దా అనుకోకండి. ‘నేను బాధ్య‌తారాహిత్యంగా మెలుగుతాను, నేనొక స్వార్థ‌ప‌రుడిని’ అని రాసి ఉన్న ప్ర‌త్యేక సెల్ఫీ పాయింట్ల వ‌ద్ద ఫొటోలు దిగ‌మ‌ని వాటిని పోలీసుల‌ ఫేస్‌బుక్ పేజీలో అప్‌లోడ్ చేస్తారు. అస‌లే తాము అప్‌లోడ్ చేసే ఫొటోకు ఎన్ని లైకులు వ‌చ్చాయి? ఎంత‌మంది చూశారు? అని ఉబ‌లాట‌ప‌డే యువ‌త ఈ వింత‌ సెల్ఫీల‌తో నామోషీగా భావించి కాస్త అయినా మారతార‌నేది వారి ఆశ‌.

దీని గురించి కొల్లాపూర్ ఎస్పీ అభిన‌వ్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ... నిబంధ‌న‌లున ఉల్లంఘిస్తున్న‌వారు బ‌య‌ట‌కు రావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను వీడియో రికార్డింగ్ చేస్తున్నామ‌న్నారు. బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ప్పుడు క‌నీసం మాస్కు కూడా ధ‌రించ‌ట్లేద‌ని, భౌతిక దూరం కూడా పాటించ‌ట్లేద‌ని పేర్కొన్నారు. అత్య‌వ‌స‌ర ప‌నిమీద బ‌య‌ట‌కు వ‌స్తే అర్థం చేసుకోవ‌చ్చు.. కానీ, ఉద‌యం, సాయంకాలం న‌డ‌క కోసం బ‌య‌ట‌కు వస్తూ బాధ్యతారాహిత్యంగా ప్ర‌వర్తిస్తున్నార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. పైగా క‌రోనా మాకు ఎందుకు వ‌స్తుంద‌’న్న నిర్ల‌క్ష్య ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. కాగా ఈ విధానం ద్వారా మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే 40 మందికిపైగా శిక్షించిన‌ట్లు వెల్ల‌డించారు (కుటుంబీకులే కాడెడ్లుగా..)

>
మరిన్ని వార్తలు