బీజేపీకి ఉద్ధవ్‌ చురకలు..

8 Oct, 2019 17:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే తనదైన శైలిలో చురకలు వేశారు. ఎవరు అంగీకరించినా లేకున్నా ఆర్థిక వ్యవస్థ మందగమనం ఎదుర్కొంటోందని, దీంతో దేశంలో నిరుద్యోగ సమస్య ఉత్పన్నమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక మందగమనం ఉందా లేదా అన్నది తర్వాత తెలియవచ్చినా ఉద్యోగాలు మాత్రం తగ్గిపోతున్నాయి..వ్యాపారాలు మూతపడుతున్నాయి..ఇది స్పష్టంగా కనిపిస్తోంది దీన్ని మనం అంగీకరించా’లని పార్టీ పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఉద్థవ్‌ ఠాక్రే  స్పష్టం చేశారు. 2014 నుంచి శివసేన మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్నా ఎప్పుడూ తాము ప్రభుత్వాన్ని అస్థిరపరచలేదని అన్నారు. ప్రభుత్వంలో ఎక్కడైనా తప్పిదాలు జరిగినప్పుడు మాత్రం తాము తమ గళం వినిపించామని గుర్తుచేశారు. సంకీర్ణ సర్కార్‌లో సంయమనం అవసరమని, భాగస్వామ్య పక్షం దూకుడు పెంచితే ప్రమాదాలు తప్పవని వ్యాఖ్యానించారు. ఇలాంటి సందర్భాలు గతంలో ఎదురయ్యాయని 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ-శివసేన పొత్తుకు విఘాతం కలిగిన విషయాన్ని ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు