జాబ్‌ ఫైరింగ్‌... మా డ్యూటీ!

8 Jan, 2018 02:18 IST|Sakshi

నొప్పించకుండా, నచ్చజెప్పి ఉద్యోగులను తొలగించే సంస్థలు తెరపైకి

న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందుగానే జాగ్రత్తలు

ప్రస్తుతం కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఉద్యోగులను అర్ధాంతరంగా తొలగిస్తున్నాయి. ఉద్వాసనకు గురికానున్న ఉద్యోగులను పిలిచి వారికి అర్థమయ్యేలా చెప్పి, ఏ మాత్రం నొప్పించకుండా వారిని పంపించేయడం సవాలుతో కూడుకున్న పనే. వారి తప్పేమీ లేకుండానే రాజీనామా చేయమంటే ఎవ్వరూ ఒప్పుకోరు. కొన్ని సందర్భాల్లో స్వల్ప వాదులాటలూ జరుగుతుంటాయి. ఉద్యోగులను భయపెట్టేందుకు కంపెనీలు బౌన్సర్లను కూడా నియమించుకుంటున్నాయని ఇటీవలే తెలిసొచ్చింది. ఆ తర్వాత నష్టపోయిన ఉద్యోగులు చట్టాలను ఆసరాగా చేసుకుని కంపెనీలపై కేసులు పెడుతుండటమూ చూస్తున్నాం.

కానీ కంపెనీలకు ఇంత కష్టం కలిగించకుండా, న్యాయపర చిక్కులూ రాకుండానే అనవసరం అనుకున్న ఉద్యోగులను పంపించేసే మార్గాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ విధానంలో ఓ వైపు కొందరికి ఉద్యోగాలు పోతుంటే మరికొందరికి మాత్రం దీని ద్వారా పని దొరుకుతుండటం విశేషం. ఇంతకీ వీరి పనేమిటంటే కంపెనీలు ఏ ఉద్యోగిని చూపిస్తే ఆ ఉద్యోగితో మాట్లాడి, వారిని ఒప్పించి, ఏ గొడవా లేకుండా ఉద్యోగాలు మాన్పించి పంపించేయడమే. ఈ పనులు చేసిపెట్టడానికి ప్రత్యేకంగా ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో కొన్ని కంపెనీలు విదేశాల్లో ఎప్పటినుంచో ఉన్నాయి. భారత్‌లోనూ వాటి సంఖ్య, అక్కడ పనిచేసే వారికి డిమాండ్‌ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. వీటిని ఔట్‌సోర్సింగ్‌ కన్సల్టెంట్, ఔట్‌సోర్స్‌ టర్మినేటర్, ఫైరింగ్‌ కన్సల్టెంట్‌ తదితర పేర్లతో పిలుస్తుంటారు.

హెచ్‌ఆర్‌తో పనిలేకుండానే...
సాధారణంగా ఏ కంపెనీలో అయినా మానవ వనరుల (హెచ్‌ఆర్‌) విభాగం కీలకమైనది. సంస్థ అవసరాలకు అనుగుణంగా కొత్త ఉద్యోగులను నియమించుకోవడం, పనితీరును, సామర్థ్యాన్ని మదింపు చేసి బాగా పనిచేసిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఏటా వేతనాలు పెంచడంతోపాటు, అనుకున్న విధంగా రాణించలేని వారిని తొలగించడం కూడా వీరి పనే. కానీ కొత్త విధానంలో మాత్రం ఉద్యోగుల తొలగింపులో హెచ్‌ఆర్‌ విభాగం పాత్ర చాలా పరిమితం. ఎవరిని ఉద్యోగాల నుంచి తొలగించాలో కంపెనీ నిర్ణయించాక, వారి జాబితాను ఫైరింగ్‌ కన్సల్టెంట్‌ కంపెనీలకు ఇస్తే చాలు. ఆ కంపెనీ ఉద్యోగులు వచ్చి, ఉద్వాసనకు గురికానున్న ఉద్యోగులతో మాట్లాడతారు. వారికి పూర్తిగా పరిస్థితిని వివరించి, నచ్చజెప్పి, భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని వాటిపై ఉద్యోగి సంతకాలు తీసుకుని రాజీనామా చేయిస్తారు. ఘర్షణాత్మక వైఖరికి అవకాశం లేకుండా సులువైన పద్ధతులను అనుసరిస్తారు. ఇలాంటి విషయాల్లో హెచ్‌ఆర్‌ మేనేజర్లకు శిక్షణ కూడా ఇస్తారు.

భారత్‌లోనూ పెరుగుతున్న డిమాండ్‌
మరొకరి ఉద్యోగాన్ని ఊడగొట్టే ఈ ఉద్యోగాలకు ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ దేశాలతోపాటు మన దగ్గరా డిమాండ్‌ పెరుగుతోంది. ఇప్పుడు ఈ రంగం కొత్త వృత్తిగా అవతరిస్తోంది. ఈ తరహా సేవల కోసం గతేడాది ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు 88.7 బిలియన్‌ డాలర్లు ఖర్చుచేసినట్లు అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఉన్న ఐడీసీ(ఎన్‌వైఎస్‌ఈ–ఐడీసీ) పరిశోధక సంస్థ వెల్లడించింది. పెద్ద కంపెనీలతో పోల్చితే చిన్న కంపెనీలకు ఉద్యోగుల రిక్రూట్‌మెంట్, పనితీరు సమీక్ష, ఉద్వాసనలు వంటి ముఖ్యమైన విధుల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలు లేనందువల్ల ఇటువంటి కన్సల్టెన్సీలపై ఆధారపడుతున్నాయంది. ఈ తరహా సేవలందించే ట్రైనెట్‌ అనే అమెరికన్‌ కంపెనీ వ్యవస్థాపకుడు మార్టిన్‌ బాబినెట్‌ మాట్లాడుతూ 2002తో పోల్చితే తమ ఆదాయం ఇప్పడు ఎన్నోరెట్లు పెరిగిందన్నారు.

కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపించడంలో అనుభవం, నైపుణ్యం ఉన్న వారిని హెచ్‌ఆర్‌ విభాగంలో నియమించుకుంటున్నాయి. 2009లో విడుదలైన, ప్రముఖ నటుడు జార్జి క్లూనీ నటించిన హాలీవుడ్‌ సినిమా ‘అప్‌ ఇన్‌ ది ఎయిర్‌’ ఈ తరహా కథాంశంతో వచ్చిందే. ఈ సినిమా అప్పట్లోనే వివిధ దేశాల్లో కలిపి 44 మిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించింది. మన దేశంలో ఉన్న రైట్‌ మేనేజ్‌మెంట్, ఆప్టిమమ్, హ్యుమన్‌ డైనమిక్, హ్యుసిస్‌ కన్సల్టింగ్, షిల్పుట్సీ వంటి కన్సల్టెన్సీ సంస్థలు ఈ కోవకు చెందినవే. ‘మా కంపెనీ సేవలను పొందేందుకు ఒక్కో ఉద్యోగికి రూ.2 లక్షల వరకు ఆయా సంస్థలు వెచ్చిస్తున్నాయి. ఆరేళ్ల క్రితం వరకు మా సేవలను ఎక్కువగా గ్లోబల్‌ కంపెనీలే ఎక్కువగా ఉపయోగించుకునేవి. రానురాను మా సేవలు కోరుతున్న భారతీయ కంపెనీల సంఖ్య కూడా పెరుగుతోంది’ అని రైట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థకు ఇండియా మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్‌ పాండే తెలిపారు.    
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు