కరోనా: మరో సీనియర్ వైద్యుడు కన్నుమూత

23 May, 2020 20:30 IST|Sakshi
డాక్టర్ జితేంద్ర నాథ్ పాండే (ఫైల్ ఫోటో)

హాస్పిటల్  క్యాంటిన్ సిబ్బంది  ఒకరు కరోనాతో మరణం

నిబంధనలు పాటించడం  లేదని ఆరోపణలు

ఇంతలోనే మరో విషాదం

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా మహమ్మారికి ఢిల్లీలోని మరో సీనియర్ వైద్యులు బలయ్యారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సీనియర్ వైద్యుడు డాక్టర్ జితేంద్ర నాథ్ పాండే (78) కోవిడ్-19తో శనివారం మరణించారు. కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న ప్రీమియర్ ఆసుపత్రిలో పల్మనాలజీ విభాగానికి డైరెక్టర్, ప్రొఫెసర్‌గా ఆయన పనిచేశారు.ఎయిమ్స్ మెస్ వర్కర్ ఈ వ్యాధితో మరణించిన ఒక రోజు తర్వాత డాక్టర్ పాండే చనిపోయారు. పాండే మరణాన్ని ధృవీకరించిన మరో  సీనియర్ వైద్యులు డాక్టర్ సంగితా రెడ్డి,  పల్మోనాలజీలో ఆయన చేసిన కృషిని, సేవలను కొనియాడారు. ఆయన కుటుంబానికి సంతాపాన్ని ప్రకటిస్తూ ఆమె ట్వీట్ చేశారు.  

కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఇప్పటికే  తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం. తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరినా  ఆర్‌పీసీ క్యాంటీన్‌ విభాగం నిరాకరించిందంటూ శుక్రవారం ఎయిమ్స్ డైరెక్టర్‌కు రాసిన లేఖలో తెలిపింది. తమ మాటలను పెడచెవిన పెట్టడం వల్లే  మెస్  వర్కర్  చనిపోయాడని వాపోయారు. ఇంతలోనే మరో విషాదం చోటు  చేసుకోవడం సిబ్బందిలో  ఆందోళన  రేపుతోంది.

కాగా కరోనా ప్రభావానికి దేశంలో దెబ్బతిన్న రాష్ట్రాలలో ఢిల్లీ ఒకటి. దేశ రాజధానిలో ఇప్పటివరకు 12,319 కేసులు నమోదు కాగా, 208 మరణాలు సంభవించాయి. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తరువాత దేశంలో అత్యధికంగా  ప్రభావితమైన నాలుగవ రాష్ట్రం ఢిల్లీ.  ప్రధానంగా వైద్యులు, నర్సులు  వైరస్  బారిన పడటంతో,  హిందూ రావు, బాబు జగ్జీవన్ రామ్ మెమోరియల్ హాస్పిటల్, ఢిల్లీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వంటి ఆసుపత్రులకు సీలు వేయవలసి వచ్చిన సంగతి తెలిసిందే. (పోయిన ప్రాణం తిరిగొచ్చింది: పండ్ల వ్యాపారి)

చదవండి :  ఆర్‌బీఐకి చిదంబరం కీలక సలహా

మరిన్ని వార్తలు