వృద్ధుల రాయితీకి ఆధార్‌ తప్పనిసరి

12 Dec, 2016 14:48 IST|Sakshi
వృద్ధుల రాయితీకి ఆధార్‌ తప్పనిసరి
న్యూఢిల్లీ: వృద్ధులు ఎవరైతే తమ రైలు ప్రయాణాల్లో రాయితీ కావాలనుకుంటారో వారు తప్పనిసరిగా ఆధార్‌ నెంబర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. రైల్వే కౌంటర్‌లు, ఈ-టికెట్‌ బుకింగ్‌ సమయంలోనూ ఆధార్‌ కార్డు వివరాలను సమర్పించిన సీనియర్‌ సిటిజెన్స్కు మాత్రమే రాయితీ వర్తిస్తుందని సీనియర్‌ రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నిర్ణయం 2017 ఎప్రిల్‌ నుంచి అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది.
 
ఆధార్‌ ఆధారిత టికెట్‌ సిస్టమ్‌ను రెండు దశల్లో అమలు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. తొలుత 2017 జనవరి 1 నుంచి మార్చి 31 వరకు రైలు టికెట్ల బుకింగ్‌ కోసం ఆధార్‌ వివరాలను నమోదు చేసుకుంటారు. అనంతరం ఎప్రిల్‌ నుంచి మాత్రం ఆధార్‌ వివరాలను సమర్పించిన వారికి మాత్రమే రాయితీ ఇస్తారు.
 
ఇప్పటికే డిసెంబర్‌ 1 నుంచి ఆధార్‌ నెంబర్‌ ద్వారా సీనియర్‌ సిటిజన్స్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారభించారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, రిజర్వేషన్ కౌంటర్లలో తమ ఆధార్‌ వివరాలను అందించాల్సిందిగా సీనియర్ సిటిజన్స్ను రైల్వే శాఖ కోరింది. చాలా మంది నకిలీ ఏజెంట్లు సీనియర్ సిటిజన్ల పేరుమీద టికెట్‌లు బుక్‌ చేసి బ్లాక్‌లో విక్రయిస్తుండటంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
 
మరిన్ని వార్తలు