వివాదం.. కెమెరాకు చిక్కిన పోలీస్‌ బాస్‌

3 Feb, 2018 10:18 IST|Sakshi
రామమందిరం నిర్మిస్తామంటూ ప్రతిజ్ఞ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ డీజీ సూర్యాకుమార్‌

సాక్షి, లక్నో : వివాదాస్పదమైన అయోధ్యలోని రామమందిరం నిర్మిస్తామంటూ ప్రతిజ్ఞ చేస్తూ ఓ పోలీసు ఉన్నతాధికారి కెమెరా కంటికి చిక్కారు. లక్నో యూనివర్సిటీలో కొంతమంది వ్యక్తులతో కలిసి ఆయన ఈ ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు ఈ విషయం పెను ధుమారం రేపుతోంది. వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లో సూర్యా కుమార్‌ అనే వ్యక్తి హోమ్‌ గార్డ్‌ విభాగానికి డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోనే సెకండ్‌ మోస్ట్‌ ఐపీఎస్‌ అధికారి. 1982 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అయిన ఆయన పోలీసు బాస్‌గా అయ్యేందుకు రేసులో కూడా ఉన్నారు.

అయితే, ఇటీవల లక్నోలోని యూనివర్సిటీలో కొంతమందితో కలిసి 'రామ్‌ మందరిర్‌ నిర్మాణ్‌ సమస్య ఎవం సమధాన్‌' అనే కార్యక్రమంలో పాల్గొని రామమందిరం నిర్మాణానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని అఖిల భారతీయ సమగ్ర విచార్‌ మంచ్‌ నిర్వహించింది. 'మనందరం రాముని భక్తులం.. వీలయినంత త్వరలో భారీ రామమందిరం నిర్మాణం పూర్తి చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం.. జైశ్రీరాం' అని ప్రతిజ్ఞ చేశారు. కాగా, దీనిపై ఆయన స్పందిస్తూ తాను కేవలం ఒక అతిథిగానే అక్కడికి వెళ్లానని, సమస్యకు పరిష్కారం ఆలోచించే దిశగా మాత్రమే అక్కడ చర్చలు జరిగాయని అన్నారు. దానికి సంబంధించిన కొద్ది వీడియో మాత్రమే బయటకు వచ్చిందని తెలిపారు.

మరిన్ని వార్తలు