వేర్పాటువాదులపై కేంద్రం ఫైర్

17 Apr, 2015 01:46 IST|Sakshi
వేర్పాటువాదులపై కేంద్రం ఫైర్

గిలానీ ర్యాలీలో పాక్ నినాదాలపై సీరియస్
కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి ఆదేశం
గిలానీ, ఆలం హౌస్ అరెస్ట్

 
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ నిర్వహించిన ర్యాలీలో పాక్ అనుకూల నినాదాలు చేయడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. దేశవ్యతిరేక చర్యల్లో పాల్గొన్న వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ఆ రాష్ర్ట సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్‌తో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. జాతీయ భద్రత విషయంలో ఏ విధంగానూ రాజీ పడకూడదని సూచించారు. ఐదేళ్ల తర్వాత రాష్ర్టంలో ర్యాలీ నిర్వహించేందుకు గిలానీకి అవకాశమిచ్చినట్లు సయీద్ వివరించారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన వేర్పాటువాద నేత మసరత్ ఆలం ఈ ర్యాలీకి నేతృత్వం వహించిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన ర్యాలీ సందర్భంగా పాక్‌కు అనుకూలంగా ఆలం నినాదాలు చేయగా, మరికొందరు ఆ దేశ జెండాలను ప్రదర్శించారు. కాగా, దీనిపై జమ్మూలో గురువారం నిరసనలు వ్యక్తమయ్యాయి.

వేర్పాటువాద నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ క్రాంతి దళ్, హిందూ శివసేన, మరో సంస్థతో పాటు కశ్మీరీ పండిట్లు నిరసనలు చేపట్టారు. కాగా, పాక్ జెండాలు ఎగరేయడం తనకు తప్పుగా కనిపించడం లేదని ఆలం అన్నారు. జాతి విద్రోహులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని బీజేపీ పేర్కొంది. ఇలాంటి ఘటనలను సహించబోమని సీఎం సయీద్ పేర్కొన్నారు.  మరోవైపు ఈ వ్యవహారంలో గిలానీ, ఆలం, మరో వేర్పాటువాద నేతలపై కశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం త్రాల్‌లో ర్యాలీ నిర్వహిం చనున్న నేపథ్యంలో ఆలం, గిలానీలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.
 

మరిన్ని వార్తలు