సీరియల్‌ కిల్లర్‌ 'సైనైడ్‌' మోహన్‌కు జీవిత ఖైదు

18 Feb, 2020 16:50 IST|Sakshi

మంగళూరు : 20 మంది యువతులను దారుణంగా రేప్‌ చేసి ఆపై హత్య చేసిన సీరియల్‌ కిల్లర్‌' సైనైడ్‌' మోహన్‌కు జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్లు మంగళూరు సెషన్స్‌ కోర్టు మంగళవారం పేర్కొంది. కాగా 2006లో కేరళలోని కస్రాగోడ్‌ జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతిని రేప్‌ చేసి హతమార్చినందుకుగానూ మోహన్‌కు జీవిత ఖైదుతో  పాటు రూ. 25వేల జరిమానా విధిస్తున్నట్లు సెషన్స్‌ కోర్టు జడ్జి సయీదున్నిసా తన తీర్పులో వెల్లడించారు. వివరాలు.. సైనైడ్‌ మోహన్‌.. ఒంటరిగా ఉన్న అమ్మాయిలను ట్రాప్‌ చేసి ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానంటూ మాయ మాటలు చెప్పి మొదట రూంకు తీసుకెళతాడు. ఆ తర్వాత సైనైడ్‌ పూసిన పదార్థాలను వారికి అందించి రేప్‌ చేస్తాడు. తర్వాత వారు చనిపోయారని నిర్దారించుకొని మెల్లగా అక్కడినుంచి జారుకుంటాడు. ఇలా ఇప్పటివరకు 20మంది యువతులను ట్రాప్‌ చేసి హతమార్చాడు. 

కాగా ఇదే విధంగా 2006 జనవరి 3న మంగళూరులోని క్యాంప్‌కో యూనిట్‌కు పని నిమ్మిత్తం వచ్చిన 23ఏళ్ల  కేరళ యువతితో మోహన్‌ పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి మైసూరులోని లాడ్జికి తీసుకెళ్లి రాత్రంతా అక్కడే గడిపారు. తెల్లవారుజామున బస్టాండ్‌కు చేరుకొని యువతి ఒంటిపై ఉన్న నగలన్ని తీసుకొని గర్భనిరోధక మాత్ర అని నమ్మించి సైనైడ్‌ పూసిన పదార్థాన్ని అందించాడు. పదార్థాన్ని మింగిన ఆమె చనిపోయిందని నిర్థారించుకొని అక్కడే వదిలిపెట్టి వెళ్లాడు. కాగా 2009లో బంట్వాల్‌లో పోలీసులకు పట్టుబడిన మోహన్‌ 20 మంది యువతుల్ని తానే చంపినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది.

మరిన్ని వార్తలు