అక్టోబర్‌–నవంబర్‌లో టీకా

23 Jul, 2020 02:09 IST|Sakshi

సీరమ్‌ సీఈఓ అదార్‌ పూనావాలా ప్రకటన

భువనేశ్వర్‌: కరోనా మహమ్మారిని నియంత్రించే వ్యాక్సిన్‌ ఈ ఏడాది అక్టోబర్‌ – నవంబర్‌కల్లా సిద్ధం కావచ్చని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీ సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదార్‌ పూనావాలా బుధవారం తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ, ఫార్మా కంపెనీ అస్ట్రాజెనెకాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకాను పెద్ద మొత్తంలో తయారు చేసేందుకు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఒక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

కరోనా టీకా మూడవ దశ మానవ ప్రయోగాలు ఆగస్టులో మొదలవుతాయని, అన్నీ సవ్యంగా సాగితే ఆ తరువాత రెండు మూడు నెలల్లో టీకా అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆదార్‌ బుధవారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. భారత్‌ బయోటెక్‌ సిద్ధం చేస్తున్న కరోనా వ్యాక్సీన్‌ మానవ ప్రయోగాలకు సంబంధించి ఒడిశా రాజధాని భవనేశ్వర్‌లో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆసుపత్రిలో ఈ ప్రయోగాలు జరగనున్నాయి. ప్రస్తుతం టీకా ప్రయోగాల కోసం కార్యకర్తలను ఎంపిక చేస్తున్నామని ఈ ప్రయోగాలకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్‌ ఇ.వెంకట్‌ రావు తెలిపారు.

మరిన్ని వార్తలు