ముందు పెళ్లాం.. తరువాతే సేవ

11 Sep, 2016 18:11 IST|Sakshi
ముందు పెళ్లాం.. తరువాతే సేవ

అహ్మదాబాద్: జీవితంలో అన్ని సుఖాలను త్యజించి సన్యాసి జీవితాన్ని ప్రారంభించిన ఓ వ్యక్తికి.. ముందు నీ భార్య సంరక్షణ భాధ్యతలు చూసుకోనాయనా అంటూ.. కోర్టు ఝలక్ ఇచ్చింది. సన్యాసత్వం పుచ్చుకొని సంపాదనకు దూరంగా ఉంటున్నా సరే.. వదిలేసిన భార్యకు భరణం చెల్లించాల్సిందేనంటూ ఘాటుగా మందలించింది. సమాజానికి సేవచేయడానికి బయలుదేరడం మంచిదే గానీ.. మరి నీ భార్య పరిస్థితి ఏంటి అని ప్రశ్నించింది.

వివరాలు..గుజరాత్కు చెందిన సునిల్ ఉదాసి అనే వ్యక్తి నుంచి విడాకులు పొందిన సోని భరణం కోరుతూ 2001లో కోర్టును ఆశ్రయించగా.. నెలకు రూ. 3500 భరణం ఇవ్వాలని ఉదాసికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఉదాసి కోర్టు చెప్పిన విధంగా భరణం చెల్లిస్తూ వచ్చాడు. అయితే 2011లో ఆయన జీవితంలో అనుకోని మార్పులు చోటుచేసుకున్నాయి. పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లిన ఉదాసి.. ఢిల్లీలో ఓ ఆశ్రమంలో చేరి సన్యాసత్వం స్వీకరించాడు. బ్యాంకు ఉద్యోగం మానేశాడు. సేవాకార్యక్రమాల్లో నిమగ్నమౌతూ జీవితాన్ని గడుపుతున్నాడు.

ఈ క్రమంలో సంపాదన లేకపోవడంతో సోనికి చెల్లించాల్సిన భరణం కష్టమైపోయింది. దీంతో 'నేను ఇప్పుడు సంపాదించడం లేదు.. చెల్లించాల్సిన భరణాన్ని తగ్గించండి' అంటూ ఉదాసి కోర్టును ఆశ్రయించాడు. అయితే ఉదాసి వాదనను విన్న గుజరాత్ హైకోర్టు.. సమాజానికి సేవచేయటం మంచిదే కానీ.. ముందు సోని గురించి ఆలోచించమంటూ సలహా ఇచ్చింది. భరణం మాత్రం తగ్గించే ప్రసక్తేలేదని  తేల్చిచెప్పింది.
 

మరిన్ని వార్తలు