గుడిలో తొక్కిసలాట

22 Apr, 2019 03:57 IST|Sakshi

తమిళనాడులో ఏడుగురు మృతి

15 మందికి గాయాలు

బాధిత కుటుంబాలకు సాయం ప్రకటించిన ప్రధాని

సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తురయూరు వండితురై కరుప్పు స్వామి ఆలయ ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా పిడి కాసుల పంపిణీలో తొక్కిసలాటతో ఏడుగురు మృతిచెందారు. వండితురై కరుప్పుస్వామి ఆలయంలో చిత్ర పౌర్ణమి ఉత్సవాల్లో చివరి రోజున పిడి కాసుల్ని(పిడికిలి నిండా చిల్లర)ను ఆలయ పూజారి పంపిణీ చేయడం ఆనవాయితీ. ఈ కాసుల్ని ఇంట్లో ఉంచుకుంటే మహాలక్ష్మి నట్టింట్లో ఉన్నట్టే అన్నది భక్తుల నమ్మకం. ఆదివారం పిడి కాసుల పంపిణీ కార్యక్రమానికి పదిహేను జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా పోటెత్తారు. పూజల అనంతరం పిడి కాసుల కోసం భక్తులు ఎగబడ్డారు.

ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో అరియలూరు జిల్లా తిరుమానూరు మంగళాపురానికి చెందిన కంథాయి(38), పెరంబలూరు జిల్లా వెప్పన్‌ తడైకు పిన్నకులంకు చెందిన రామర్‌(52), నమ్మక్కల్‌ జిల్లా సేందమంగళంకు చెందిన శాంతి(47), కరూర్‌ జిల్లా నన్నియూర్‌కు చెందిన లక్ష్మి కాంతన్‌(60), కడలూరు జిల్లా పిన్నయత్తూరుకు చెందిన పూంగావనం(46), అరియలూరు జిల్లా పొన్‌ పరప్పికి చెందిన వళ్లి(46), కడలూరు జిల్లా దిట్టకుడికి చెందిన రాఘవేల్‌(52) అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆలయ ఉత్సవాలు నిర్వహిస్తున్న పూజారి ధనపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే, గాయపడిన వారికి ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.50వేల చొప్పున అందజేస్తామన్నారు.

మరిన్ని వార్తలు