7లక్షలు దాటిన కేసులు 

8 Jul, 2020 02:10 IST|Sakshi

5 రోజుల్లో లక్షకు పైగా కేసులు

దేశంలో శరవేగంగా కరోనా వ్యాప్తి

న్యూఢిల్లీ: భారత్‌ లో కోవిడ్‌ కేసులు 6 లక్షలు దాటిన కేవలం అయిదు రోజుల్లోనే 7 లక్షల సంఖ్యను దాటేశాయి. ఒక్కరోజులోనే 22,252 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 7,19,665కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో మరో 467 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య  20,160కు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.  అయిదు రోజులుగా వరుసగా రోజుకు 20 వేలకు పైగా కొత్త కేసులు బయటపడుతున్న సంగతి తెలిసిందే. 1 నుంచి లక్ష కేసులు చేరుకోవడానికి 110 రోజులు పట్టగా అక్కడి నుంచి 7 లక్షలకు కేవలం 49 రోజుల సమయం మాత్రమే తీసుకుంది. ఇప్పటి వరకూ 61.13 శాతం మంది రోగులు కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం వరకు మొత్తం 1,02,11,092 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపారు.

మహారాష్ట్రలోనే అధికం.. 
24 గంటల్లో మొత్తం 467 మరణాలు సంభవించగా అందులో అత్యధికంగా మహారాష్ట్రలో 204, తమిళనాడులో 61, ఢిల్లీలో 48, కర్ణాటకలో 29, ఉత్తరప్రదేశ్‌లో 24, పశ్చిమబెంగాల్‌లో 22, గుజరాత్‌లో 17 తెలంగాణలో 11, ఆంధ్రప్రదేశ్‌లో 7 మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా అత్యధిక మరణాల్లో సైతం 9 వేలకు పైగా మరణాలతో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా, ఢిల్లీలో 3,115, గుజరాత్‌లో 1,960, తమిళనాడులో 1,571, ఉత్తరప్రదేశ్‌లో 809 మరణాలు సంభవించాయి. అత్యధిక కేసుల విషయంలో మహారాష్ట్ర ముందుండగా తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌ ఉన్నాయి.

కోవిడ్‌ మరణాలు దేశంలోనే తక్కువ
ప్రపంచంతో పోలిస్తే భారత్‌లోనే కరోనా కేసులు, కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయని కేంద్రం తెలిపింది.  ప్రపంచంలో ప్రతి పది లక్షల మందిలో 1,453.25 మందికి కరోనా సోకుతుండగా, అది భారత్‌లో 505.37గా ఉంది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 లక్షల మందికి 68.29 మంది కరోనాతో చనిపోతుండగా, భారత్‌లో అది 14.27గా ఉంది. ఈ సంఖ్య యూకేలో 651.4, మెక్సికోలో 235.5గా ఉంది.

మరిన్ని వార్తలు