శివసేనలో ఏడుగురు కాంగ్రెస్ కార్పొరేటర్ల చేరిక

20 Jul, 2014 00:04 IST|Sakshi
శివసేనలో ఏడుగురు కాంగ్రెస్ కార్పొరేటర్ల చేరిక

సాక్షి, ముంబై: ఠాణేకి చెందిన కార్పొరేటర్ రవీంద్ర పాఠక్ సహా ఏడుగురు కార్పొరేటర్లు శనివారం శివసేనలో చేరారు. పాఠక్ కాంగ్రెస్ నాయకుడు, పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణేకు అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. దీంతో రాణే ఏకాకిగా మిగిలిపోయారని రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కుమారుడి ఓటమి, కాంగ్రెస్ అధిష్టానం నిర్లక్ష్యంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి న పరిస్థితి రావడం లాంటి సమస్యలతో రాణే ఇప్పటికే ఇబ్బందుల్లో పడిపోయారు. దీనికి తోడు తనకు అత్యంత సన్నిహితుడైన పాఠక్ మరో ఆరుగురు  కార్పొరేటర్లతో శివసేనలో చేరడం రాణేకు గట్టి దెబ్బ తగిలినట్లు భావిస్తున్నారు.
 
లోక్‌సభ ఎన్నికల తర్వాత రాణే రాజకీయ భవిత తలకిందులైంది. కుమారుడు నిలేష్ రాణే పరాజయంతో ఆయన ప్రాబల్యానికి గండిపడినట్లయ్యింది. మరోపక్క పార్టీలో ఆయన పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నిప్పుకు గాలి తోడయినట్లు ఫాటక్‌తోసహా ఇతని భార్య, దీపక్ వేత్కర్, రాజా గవారి, కాంచన్ చింద్కర్, మన్‌ప్రీత్ కౌర్, మీనల్ సంఖ్యే ఇలా ఏడుగురు శివసేనలో చేరారు.

దీంతో అత్యంత సన్నిహితులైన వీరంతా రాణేకు దూరం కావడం దెబ్బమీద దెబ్బ తగిలినట్లయింది. వీరందరికీ శనివారం మాతోశ్రీ బంగ్లాలో ఉద్ధవ్ ఠాక్రే స్వాగతం పలికారు. ఇదిలాఉండగా అప్పట్లో నారాయణ్ రాణే శివసేనతో తెగతెంపులు చేసుకుని బయటపడిన సమయంలో రవీంద్ర పాఠక్ కూడా ఆయన వెంట వచ్చేశారు.
 
దీన్ని దృష్టిలో ఉంచుకుని గత శాసన సభ ఎన్నికల్లో కాంకావ్లీ నుంచి పాఠక్‌కు రాణే కాంగ్రెస్ టికెట్ ఇప్పించారు. అయితే స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ పాఠ్ ఇప్పటివరకు రాణేతోనే కొనసాగుతున్నారు. కాని ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు పొడసూపినట్లు తెలిసింది. రాణేలో పాఠక్‌కు రాజకీయంగా మంచి పట్టు ఉంది. ఆయన శివసేనలో చేరడంవల్ల ఠాణేలో ఆ పార్టీ మరింత బలపడనుంది. పాఠక్ పార్టీ మారడంపై రాణే మాట్లాడుతూ.
 
తనతో ఉండాలనుకునేవారు ఉండవచ్చు, వెళ్లాలనుకునేవారు వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. ఇలా మిత్రద్రోహం చేసినవారు త్వరలోనే ప్రతిఫలం అనుభవిస్తారని రాణే వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పుడు రాణే ఓపిగ్గా, సమయస్పూర్తితో మెలగాల్సిన అవసరమచ్చిందని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ఏదో ఒక పార్టీలో చిత్తశుద్ధితో కొనసాగితే మంచిదని హితవు పలికారు.
 

మరిన్ని వార్తలు