పాక్‌కు బుద్ధి చెప్పిన భారత్‌

3 Apr, 2019 04:15 IST|Sakshi

ఏడు పాక్‌ సైనిక పోస్టులను ధ్వంసం చేసిన భారత్‌ 

కాల్పుల విరమణను ఉల్లంఘించినందుకు...

జమ్మూ: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సరిహద్దు ప్రాంతాలైన రాజౌరీ, పూంచ్‌ జిల్లాల్లో మోర్టారు దాడులు, కాల్పులకు తెగబడ్డ పాకిస్తాన్‌కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది. పాక్‌కు చెందిన 7 సైనిక పోస్టులను భారత్‌ ధ్వంసం చేసింది. పలువురు పాక్‌ సైనికులు గాయపడ్డారు. ఈ మేరకు ఉన్నతాధికారులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన అనంతరం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజౌరీ, పూంచ్‌ జిల్లాల్లో సరిహద్దు ప్రాంతాల్లోని స్కూళ్లను మూసివేశారు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పూంచ్‌ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి సోమవారం పాక్‌ మోర్టారు దాడులు చేయడంతో ఓ బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్, ఐదేళ్ల బాలికతోపాటు ముగ్గురు మరణించారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్, నౌషెరా సెక్టార్‌ పరిధిలోని రాజౌరీలో పాక్‌ సోమవారం మొదలుపెట్టిన మోర్టారు దాడులు, కాల్పులు మంగళవారం కొనసాగాయి. ఇందుకు ప్రతిగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వెంబడి రాక్‌చిక్రి, రావలకోటె ప్రాంతాల్లో ఉన్న 7 పాక్‌ సైనిక పోస్టులను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ముగ్గురు పాక్‌ సైనికులు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు పాకిస్తాన్‌ ప్రభుత్వ విభాగం తెలిపింది.

>
మరిన్ని వార్తలు