మురుగు నీళ్లతో సాగునీరు!

16 Jun, 2016 01:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మురుగునీటిని శుద్ధి చేసి సాగుకు పనికొచ్చేలా మార్చే కొత్త పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు  కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. భారత్, యూరోపియన్ యూనియన్‌లకు చెందిన 11 సంస్థలు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహకారంతో ‘వాటర్ ఫర్  క్రాప్స్’ ప్రాజెక్ట్ కింద పరిశోధనలు జరిపి దీన్ని రూపొందించాయని వెల్లడించారు. గత 4 ఏళ్లుగా ‘వాటర్ ఫర్  క్రాప్స్’ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్‌లోని ఇక్రిసాట్ సమన్వయంతో జరిపిన పరిశోధనలు, ప్రణాళికలను ఆయన బుధవారం సమీక్షించారు.

మురుగునీటిని శుద్ధి చేసి వ్యవసాయానికి వాడితే 40 శాతం అధిక దిగుబడి వస్తుందన్నారు. ఈ నీటిలో నత్రజని, భాస్వరం ఉంటాయని, అందువల్ల ఎరువుల వాడకం తగ్గుతుందని, సాగు చేసిన పంటలు సురక్షితమని తెలిపారు. రూ. 3 నుంచి 5 లక్షల వ్యయంతో మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయవచ్చన్నారు. ఏపీ, తెలంగాణ సహా 6 రాష్ట్రాలు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపించాయని, ఇక్రిసాట్ సహకారంతో ఏపీలో పైలట్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి  చెప్పారు.

>
మరిన్ని వార్తలు