కాలుతున్న శవాల మధ్య వేశ్యల నృత్యం

29 Mar, 2018 12:40 IST|Sakshi
చైత్ర నవరాత్రి సప్తమి రోజున మణికర్ణిక ఘాట్‌ వద్ద వేశ్యల నృత్యం

వారణాసి : తమ వారిని కోల్పోయిన సమయంలో దహన సంస్కారాల వద్ద ఆ‍త్మీయుల రోదనలను చూస్తుంటాం. కానీ, వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌ వద్ద ఇందుకు భిన్నంగా జరుగుతుంది. నిరంతరం దహన సంస్కారాలు జరిగే ఈ ప్రదేశంలో ఓ వింత ఆచారం అమలు అవుతోంది. చైత్ర నవరాత్రి సప్తమి రోజున రాత్రి నుంచి తెల్లవారే వరకూ వేశ్యలు అవిరామంగా మణికర్ణిక ఘాట్‌లో నృత్యాలు చేస్తారు.

అయితే ఈ నృత్యాలు వేడుక కోసం కాదు. జీవితంలో తాము చేసిన తప్పులను మన్నించమని మహా శంషాన్‌ బాబాను కోరుతూ వారందరూ ఈ నృత్యం చేస్తారు. ఇలా చేయడం వల్ల మిగిలిన జీవితంలో ఆ వేశ్యలకు ఆనందం, గౌరవం దక్కుతాయని నమ్మకం. ఈ మణికర్ణిక ఘాట్‌ వద్దే పార్వతి దూరమైన తర్వాత ఆ ఎడబాటును భరించలేని మహాశివుడు తాండవ నృత్యం చేశాడని ప్రతీతి.

మణికర్ణిక ఘాట్‌ వద్ద వేశ్యలు చేసే ఈ నృత్యాన్ని ‘తపస్యా’ అని పిలుస్తారు. ప్రతి ఏడాది చైత్ర నవరాత్రి సందర్భంగా సప్తమి రోజున వేశ్యలు ఇక్కడికి వచ్చి బాబా ముందు నృత్యం చేస్తారు.

ఎప్పుడు మొదలైందీ సాంప్రదాయం...?
16వ శతాబ్దంలో అక్బర్‌ నవరత్నాల్లో ఒక్కరైన రాజా మన్‌ సింగ్‌ ఈ ఘాట్‌లో ఓ ఆలయాన్ని మహాశివుడికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఓ మ్యూజికల్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. కానీ కాలుతున్న శవాల మధ్యకు వచ్చి నృత్యం చేసేందుకు ఏ కళాకారుడు ముందుకు రాలేదు. దాంతో వేశ్యలకు కబురు పంపడంతో వారు అక్కడకు వచ్చి నాట్యం చేశారు.

ఆనాటి నుంచి చైత్ర నవరాత్రి సప్తమి రోజున వేశ్యలు మణికర్ణిక ఘాట్‌లో నృత్యం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు