మారని ఆమె కథ!

19 Nov, 2017 02:38 IST|Sakshi

పని ప్రదేశాల్లో మహిళలకు తప్పని లైంగిక వేధింపులు 

మహిళా న్యాయమూర్తుల నుంచి ఇంట్లో పనివారిదాకా.. 

ఫిర్యాదు చేస్తే.. మరింతగా ఇబ్బందులు 

అవ్యవస్థీకృత రంగంలో పరిస్థితి మరింత దారుణం 

న్యాయమూర్తి అయినా.. ఉన్నత బాధ్యతలు నిర్వర్తించే అధికారి అయినా.. ప్రజాప్రతినిధి అయినా.. చివరికి ఓ ఆఫీసులో పనిచేసే క్లర్క్‌ అయినా.. ఇంట్లో పనిమనిషి అయినా.. ఎక్కడ చూసినా మహిళలకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఆకాశంలో సగం అని కీర్తిస్తున్నా.. అణు మాత్రం ఆచరణలోకి రావడం లేదు. ఢిల్లీ ట్రాఫిక్‌ కోర్టు మహిళా న్యాయమూర్తి ఉదంతం ఇందుకు మినహాయింపేమీ కాదు. ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్న ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు అమికస్‌ క్యూరీ (కోర్టు సహాయకులు)గా సీనియర్‌ న్యాయవాది, హక్కుల ఉద్యమవేత్త వృందా గ్రోవర్‌ను నియమించింది. మరోవైపు హాలీవుడ్‌ సినీ పరిశ్రమలో పెద్ద తలకాయ హార్వే వెయిన్‌స్టీన్‌ హీరోయిన్లు, మోడల్స్‌ను వేధించిన బాగోతాలు బయటపడడంతో పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.         
- సాక్షి, తెలంగాణ డెస్క్‌

ఆమె ఢిల్లీలో ట్రాఫిక్‌ కోర్టు న్యాయమూర్తి.. ట్రాఫిక్‌ ఉల్లంఘన  కేసులపై విచారణ జరుపుతున్నారు.. ఓ ముద్దాయికి కాస్త తీవ్రమైన శిక్ష విధించారు.. దీంతో ఆ ముద్దాయి తరఫు సీనియర్‌ పురుష న్యాయవాది ఒక్కసారిగా రెచ్చిపోయాడు.. కనీస సంస్కారాన్ని మరిచి ‘అసలు నువ్వేంటి? నీ సాయేమిటి? నీ చెడ్డీ చింపి పడేస్తా.. (తెరీ ఔకాత్‌ క్యా హై.. తెరీ చెడ్డీ ఫాడ్‌కే రఖ్‌ దూంగా..)’ అంటూ బూతులు తిట్టాడు.. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆమె ఏడ్చేశారు. పోలీసు కేసు పెట్టారు. కానీ రెండు నెలలు గడిచినా ఆ న్యాయవాదిపై చర్యల్లేవు. కేసులో చార్జిషీటు కూడా దాఖలు కాలేదు. ఇతర న్యాయమూర్తులు, న్యాయ వాదులు కూడా ‘విచారణ అవమానాన్ని ఆమె ఎలా ఎదుర్కొంటుంది? రాజీ చేసుకోవడం మంచిదేమో..’ అన్నట్లుగా మాట్లాడారు. రెండేళ్లయినా ఆ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏకంగా న్యాయమూర్తికే ఇలాంటి దుస్థితి. 

ఆమె బాధ అర్థం చేసుకునేదెవరు? 
ఆమె 15 ఏళ్ల బాలిక.. తండ్రి చనిపోయాడు.. తనకన్నా ముగ్గురు చిన్నవాళ్లున్నారు.. తల్లి పాచిపని చేసి పోషిస్తోంది.. దీంతో చేదోడుగా ఉండేందుకు ఓ ఇంట్లో పనిమనిషిగా కుదిరింది. ఆ ఇంటి యజమాని తండ్రి 60 ఏళ్ల ముసలివాడు. ఎప్పుడూ ఆ బాలిక వెనకే తిరుగుతూ ఉంటాడు. ఎలాగోలా తాకాలని చూడడం.. చేయి వేయడం.. రాత్రిళ్లు వెళ్లి గది తలుపుకొట్టడం. ఇంట్లో వాళ్లంతా ఎటైనా వెళుతున్నప్పుడు కావాలని ఒక్కడే ఉండిపోవడం.. ఆ బాలికను లొంగదీసుకోవాలని చూడడం.. వంటివి చేసేవాడు. ఈ విషయం అందరికీ చెబుతానంటే.. దొంగతనం చేశావంటూ పోలీసులకు పట్టిస్తానని బెదిరించేవాడు. విషయం తెలిస్తే పని మాన్పించేస్తుందని, ఇంట్లో కష్టమవుతుందని తల్లికి కూడా చెప్పుకోలేకపోయింది.. చివరికి వేధింపులు తట్టుకోలేక పనిమానేసింది. ఈ బాలికే కాదు.. వేలాది మంది నిరుపేద బాలికలు, మహిళలు ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నారు.

కింది స్థాయి కోర్టుల్లో పనిచేసే మహిళా న్యాయమూర్తులకు తరచూ వేధింపులు ఎదురవుతుంటాయని ఓ మహిళా న్యాయమూర్తి వెల్లడించారు. ‘‘కొందరు న్యాయవాదులు మహిళా న్యాయమూర్తిని ఉద్దేశించి.. ‘నువ్వు.. నీకు’ అంటూ ఏకవచనంతో మాట్లాడుతుంటారు. నేరుగా అనకుండా.. మాకు వినిపించేలా మాట్లాడుతుంటారు. కానీ మాలో చాలా మంది అలాంటి వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. ఒకవేళ ఫిర్యాదు చేద్దామనుకున్నా బార్‌ అసోసియేషన్లు, తోటి పురుష న్యాయమూర్తులు ‘రాజీ’ చేసుకొమ్మని.. క్షమించేయాలని ఒత్తిడి తెస్తుంటారు. ఎందుకంటే పురుష న్యాయమూర్తులు కూడా సమాజంలో భాగమే కదా. ఇక పై స్థాయి కోర్టుల్లోనూ ఏం జరుగుతుందనే దానిని పట్టించుకోరు.

అసలు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయడానికి జడ్జీల కోసం ఫోరం ఉందా, లేదా అన్నదీ తెలియదు..’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా న్యాయమూర్తుల విషయంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మహిళా న్యాయవాదుల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించుకోవచ్చని వృందా గ్రోవర్‌ పేర్కొన్నారు. ‘‘ముఖ్యంగా ఈ వృత్తిలో సీనియర్లు, అనుభవజ్ఞులైన లాయర్ల వద్ద పనిచేయాల్సిన స్థితి యువ మహిళా న్యాయవాదులకు మరింత ఇబ్బందికరం. ఎవరెవరికీ దూరంగా ఉండాలనేది వారికి చాలా త్వరగానే అర్థమైపోతుంది..’’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ సమస్యను గుర్తించిన నేపథ్యంలో ఇటీవలే ఢిల్లీ హైకోర్టు, జిల్లా కోర్టుల కోసం అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. న్యాయాధికారులు, లాయర్లు, కోర్టు సిబ్బందిలో మహిళల శాతాన్ని పెంచితే ఈ సమస్య తగ్గుతుందన్నారు. తాను న్యాయవాద వృత్తిలోకి వచ్చేనాటికి ఈ రంగంలో చాలా తక్కువ మంది మహిళలు ఉండేవారని.. తానూ లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని చెప్పారు. 

ఫిర్యాదు చేసేది చాలా తక్కువ 
దేశవ్యాప్తంగా పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల అంశంపై జాతీయ బార్‌ అసోసియేషన్‌ (ఐఎన్‌బీఏ) ఈ ఏడాది జనవరిలో విస్తృత సర్వే చేసింది. అన్ని రంగాలు, వృత్తుల్లోనూ.. అన్ని స్థాయిల్లోనూ మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు గుర్తించింది. అసలు వేధింపులకు గురవుతున్నవారిలో 70 శాతం మహిళలు అసలు ఫిర్యాదే చేయడం లేదని తేల్చింది. ఇక జూన్‌లో ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ చేసిన ఓ సర్వేలో.. ప్రైవేటు సంస్థల్లోని మహిళా మేనేజర్లలో 44 శాతం మంది తాము లైంగికపరమైన వేధింపులకు గురయ్యామని వెల్లడించినట్లుగా పేర్కొంది. తోటి పురుష ఉద్యోగులు, పైఅధికారులు తమ ప్రవర్తన, మాట తీరుతో వేధిస్తున్నారని.. కొందరు భౌతికంగా వేధింపులకు తెగబడుతున్నారని పేర్కొన్నట్లు తెలిపింది. 

ఇలాగైతే ఎలా మరి? 
- పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై మహిళలు ఫిర్యాదు చేసినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటోంది. యాజమాన్యాలు కేవలం సదరు పురుష ఉద్యోగులను మరో విభాగానికో, మరో చోటికో బదిలీ చేయడంతో సరిపెడుతున్నాయి. 
- ఫిర్యాదు చేసిన మహిళా ఉద్యోగిని కూడా సస్పెన్షన్‌లో ఉంచడం, ఉద్యోగం నుంచి తొలగించడం.. సదరు పురుష ఉద్యోగి తప్పు చేసినట్లు రుజువయ్యాకే తిరిగి విధుల్లోకి తీసుకుంటామని చెప్పడం వంటి చర్యలు చేపడుతున్నాయి. దీంతో మహిళలు వేధింపులకు గురైనా ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. 
- మహిళలు వేధింపులపై ఫిర్యాదు చేసినప్పుడు.. అది వాస్తవమని ఎలా రుజువు చేయాలనేది ఇబ్బందికరంగా మారుతోంది. 
- పై అధికారులపై ఫిర్యాదు చేస్తే.. వేధింపులు మరింతగా పెరుగుతున్నాయి. దీంతో మరీ తీవ్రమైన ఘటనలు మాత్రమే బయటికి వస్తున్నాయి. 
- కనీసం పది మందికన్నా ఎక్కువమంది ఉద్యోగులు ఉండే సంస్థలు, పరిశ్రమలు, కార్యాలయాల్లో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలనే నిబంధన ఉంది. కనీసం నలుగురితో ఉండే ఆ కమిటీలో.. మహిళా హక్కుల కోసం పోరాడే స్వచ్చంద సంస్థ కార్యకర్త ఒకరు తప్పనిసరిగా ఉండాలి. కానీ చాలా సంస్థల్లో ఇలాంటి వ్యవస్థ ఏదీ ఉండడం లేదు. 

వేధింపులపై లెక్కలేవీ? 
ఇటీవలి కాలంలో మహిళలు అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తున్నారు. ఐటీ రంగం నుంచి విమాన పైలట్లు, సైన్యం దాకా అన్నింటిలోనూ మహిళల శాతం క్రమంగా పెరుగుతోంది. కానీ ఇది కేవలం పైకి కనిపిస్తున్నదే. ఇప్పటిదాకా మహిళల శాతం అతి తక్కువగా ఉన్న రంగాల్లో వారి ప్రాతినిధ్యం పెరుగుతుండగా.. మొత్తంగా ఉద్యోగం చేసే మహిళల సంఖ్య బాగా తగ్గిపోతోంది. ఓ సర్వే ప్రకారం భారత్‌లో గత రెండు దశాబ్దాల్లో పనిలో మహిళా భాగస్వామ్యం 34.8 శాతం నుంచి 27 శాతానికి తగ్గిపోయింది. మహిళలను బయటికి పంపించకుండా.. ఇల్లు, పిల్లల బాధ్యతను చూసుకునేవారిగానే పరిగణిస్తున్నారు. అయితే ఇలా మహిళల భాగస్వామ్యం తగ్గిపోవడానికి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు కూడా కారణమా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కానీ పని ప్రదేశాల్లో వేధింపులపై గణాంకాలు లేవు.

తెలంగాణలో.. కలెక్టర్‌కూ తప్పలేదు..
జూలై 12న మహబూబాబాద్‌లో జరిగిన మూడో విడత హరితహారం కార్యక్రమంలో ఆ జిల్లా కలెక్టర్‌ ప్రీతిమీనాతో అధికార పార్టీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అమర్యాదకరంగా ప్రవర్తించారు. కలెక్టర్‌ మీనా చేతులను ఆయన ఉద్దేశపూర్వకంగా తాకారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటికి వచ్చాయి. శంకర్‌నాయక్‌ ప్రవర్తనతో కలత చెందిన కలెక్టర్‌ ప్రీతిమీనా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే దీనిపై వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్‌ శంకర్‌నాయక్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఐఏఎస్‌ అధికారుల సంఘం కూడా దీనిని తీవ్రంగా తప్పుబట్టింది. దాంతో కలెక్టర్‌కు శంకర్‌నాయక్‌ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.  

చట్టం ఏం చెబుతోంది? 
పని ప్రదేశంలో లైంగిక వేధింపులపై 2013లో కేంద్రం చట్టం చేసింది. వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలు సహా ఎక్కడైనా మహిళలకు వేధింపుల నుంచి రక్షణ ఉండాలని స్పష్టం చేసింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అవ్యవస్థీకృత రంగంలో.. ముఖ్యంగా ఇళ్లలో పని మనుషులుగా, వంటచేసేవారుగా, ఇతర పనుల్లో ఉన్న మహిళలపై వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయి. ఆ ఇళ్ల యజమానులతో పాటు అక్కడ పనిచేసే డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, తోటపని, ఇతర ఇంటి పనులు చేసే పురుష సిబ్బంది కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఫిర్యాదులు దాదాపుగా ఉండవు. మహిళలు వేధింపులను భరించగలిగినంత కాలం భరించి.. చివరికి అక్కడ పని మానేస్తున్నారు. కానీ మరో చోట పనిలో చేరినా ఇదే తరహా పరిస్థితి ఉంటోంది. 

నోరు తెరిస్తే మరిన్ని వేధింపులు 
ఆమె ఓ వార్తా సంస్థలో మానవ వనరుల విభాగం (హెచ్‌ఆర్‌)లో పనిచేసేది.. భర్త కొన్నేళ్ల కింద మరణించాడు. ఆ సంస్థను ఓ విదేశీ సంస్థ టేకోవర్‌ చేశాక ఆమె ఉద్యోగాన్ని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) పరిధిలోకి మార్చారు. అప్పటికే ఆ ఎండీ ప్రవర్తన బాగోదన్న ప్రచారమున్నా.. అవన్నీ ఉత్త గాసిప్స్‌ అనుకుంది. కానీ తర్వాత అతడి అసలు స్వరూపాన్ని గుర్తించింది. తరచూ క్యాబిన్‌లోకి పిలిచి కబుర్లు చెప్పడం, భర్త లేడు కాబట్టి తాను సంతోషంగా చూసుకుంటాననడం, తరచూ తాకడం వంటివి చేశాడు. కొద్దిరోజులు ఓపిక పట్టిన ఆమె చివరికి పై అధికారులకు ఫిర్యాదు చేసింది. కానీ అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఆఫీసులో మీటింగులకు పిలవకపోవడం.. కావాలని గంటలకు గంటలు ఎక్కువసేపు పనిచేయించుకోవడం.. సరిగా పనిచేయడం లేదంటూ నివేదికలు పంపడం వంటివాటితో వేధించారు. చివరికి రాజీనామా చేస్తే.. ఆఫీసు నుంచి వచ్చే గ్రాట్యుటీ కూడా తక్కువగా ఇచ్చారు. 

ఇలా ఎదుర్కోవచ్చు..
- కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆన్‌లైన్‌ ఫిర్యాదుల వ్యవస్థను ‘షిృబాక్స్‌’ పేరుతో ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఏ రంగంలోనైనా పని ప్రదేశంలో మహిళలు వేధింపులకు గురైతే దానికి ఫిర్యాదు చేయవచ్చు. 
కేంద్ర, రాష్ట్రాల మహిళా కమిషన్‌లను, మహిళల హక్కుల కోసం పోరాడే స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించవచ్చు. 

ఆంధ్రప్రదేశ్‌లోనూ..
ముసునూరు తహసీల్దార్‌పై చింతమనేని దాడి 
నిజాయతీగా విధులు నిర్వర్తించిన కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్‌ ద్రోణవల్లి వనజాక్షిపై ఏపీ ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తన అనుచరులతో దాడికి పాల్పడ్డారు. 2015 జూలై 8న తమ్మిలేరులో ఇసుక మాఫియా ట్రాక్టర్లను వనజాక్షి అడ్డుకున్నారు. దాంతో ఆగ్రహించిన చింతమనేని, ఆయన అనుచరులు ఆమెపై దాడి చేశారు. దీనిపై ఫిర్యాదు చేస్తే.. అసలు ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్లావంటూ ఏపీ సీఎం చంద్రబాబు వనజాక్షినే తప్పుబట్టారు. రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేయడంతో.. కంటితుడుపుగా ఓ ఏకసభ్య కమిషన్‌ వేశారు. ఆ కమిషన్‌ తూతూమంత్రంగా స్టేట్‌మెంట్లు రికార్డు చేసింది. తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. ఆమెకు జరిగిన అవమానానికి న్యాయం మాత్రం జరగలేదు. 

అక్రమాలను అడ్డుకున్నందుకు..
2015 జూలైలో చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు మండల తహసీల్దార్‌ నారాయణమ్మ.. అక్కడి రంగన్నగారిగడ్డ గ్రామంలో చెరువు ఆక్రమణలను గుర్తించారు. దానిని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో.. టీడీపీ మద్దతు ఉన్న సర్పంచ్‌ రమణారెడ్డి, తన అనుచరులతో కలసి ఆమెపై దాడి చేసి, దుర్భాషలాడారు. దీనిపై ఇప్పటికీ చర్యలు శూన్యం. 

ఐఏఎస్‌నే వేధించిన మంత్రి అచ్చెన్నాయుడు! 
ఓ మహిళా ఐఏఎస్‌ అధికారి పట్ల ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసభ్యంగా ప్రవర్తించారన్న ఫిర్యాదు కలకలం రేపింది. అసభ్యంగా మాట్లాడటంతో ఆవేదన చెందిన ఆ మహిళా అధికారి.. ఇక్కడి ఉన్నతాధికారులతోపాటు ఢిల్లీలోనూ ఫిర్యాదులు చేశారు. వివాదం బయటకు పొక్కితే రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలవుతుందన్న భయంతో కీలక అధికారులను రంగంలోకి దించి రాజీ చేసినట్లు తెలిసింది. ఆ మహిళా అధికారి కొంతకాలం కింద కేంద్ర సర్వీసుకు వెళ్లిపోయారు. 

మహిళా ప్రజాప్రతినిధులకూ తప్పని కష్టాలు.. 
- గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ జానీమూన్, రూరల్‌ ఎంపీపీ తోట లక్ష్మీకుమారిలపైన ఏడాది కింద టీడీపీ ప్రజాప్రతినిధులు వేధింపులకు దిగిన సంఘటనలు వివాదాస్పదమయ్యాయి. 
మాచర్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గోపవరపు శ్రీదేవిని సైతం టీడీపీ నేతలు తీవ్ర వేధింపులకు గురిచేశారు. ఏ పనీ చేయకుండా అడ్డుపడి, పదవి నుంచి దిగిపోవాలని బెదిరించారు. ఈ ఒత్తిళ్లతో శ్రీదేవి భర్త మల్లికార్జునరావు గుండెపోటుతో మృతి చెందాడు. అయినా శ్రీదేవితో బలవంతంగా రాజీనామా చేయించడంతో.. ఆమె బలన్మరణానికి పాల్పడింది. చివరికి వారి ఒక్కగానొక్క కుమారుడు అనాథగా మారాడు. 
- బాపట్ల ఎంపీపీ విజేత సైతం అధికార పార్టీ ఎమ్మెల్సీ వేధింపులు ఎదుర్కొన్నారు. పదవి నుంచి దిగిపోవాలన్న బెదిరింపులు, ఒత్తిళ్లు తట్టుకోలేక ఆమెకు గుండెపోటు వచ్చింది.  
(ఇండియాస్పెండ్‌ వెబ్‌సైట్‌ సౌజన్యంతో..)  

ఫిర్యాదు చేసినా అన్యాయమే! 
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై మహిళలు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని, రాజీ కుదుర్చుకోవాలని ఒత్తిళ్లు. చివరికి కక్ష సాధింపు చర్యలు. లైంగిక వేధింపుల కేసులపై ఫిర్యాదులు చేసేవారిలో చాలా మందికి అన్యాయమే మిగులుతుందని సీనియర్‌ న్యాయవాది రెబెక్కా జాన్‌ పేర్కొ న్నారు. దాంతో చాలా మంది ఉద్యోగాన్ని వదిలివేస్తున్నారని.. ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారని చెప్పారు. 
​​​​​​​- 2014లో మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లా కోర్టు మహిళా న్యాయమూర్తి తనను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌కే గంగూలీ లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం.. ‘తగిన ఆధారాలు’ లేవంటూ పక్కన పెట్టేసింది. చివరికి 2015 ఏప్రిల్‌లో ఏకే గంగూలీని అభిశంసించాలని కోరుతూ 58 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేశారు. దాంతో అప్పటి ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ ముగ్గురు న్యాయ నిపుణులతో కమిటీని వేశారు. ఆ కమిటీ తాజాగా ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు తన నివేదికను సమర్పించింది. అయితే ఆ మహిళా న్యాయమూర్తి 2014లోనే తన పదవికి రాజీనామా చేసేశారు. 
​​​​​​​- కొద్దిరోజుల కింద ఓ టీవీ చానల్‌లో పనిచేసే న్యూస్‌ యాంకర్‌ లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆగ్రహించిన చానల్‌ యాజమాన్యం మరే సంస్థలో ఆమెకు ఉద్యోగం దొరక్కుండా చేసింది. 
​​​​​​​-  ప్రతిష్టాత్మక ‘టెరి (ది ఎనర్జీ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌)’ సంస్థలో తన పైఅధికారి ఆర్‌కే పచౌరీ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ మహిళా ఉద్యోగి 2015 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేసింది. ఆమెను తాత్కాలికంగా ఉద్యోగం నుంచి తొలగించారు. ఇప్పటికీ ఆ కేసు తేలలేదు. 

వేధింపులకు నిరసనగా ‘నేను సైతం’.. 
ప్రముఖుల లైంగిక వేధింపులపై అమెరికన్‌ మహిళల ఉద్యమం 
పని ప్రదేశంలో లైంగిక వేధింపులపై అమెరికాలో ఉద్యమం మొదలైంది. వేధింపులకు గురైనవారంతా ‘నేను సైతం’ అంటూ బయటికి వచ్చి తాము అనుభవించిన దుష్కృత్యాలను బయటపెడుతున్నారు. ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌ తమను వేధించారంటూ కొందరు మహిళలు ముందుకు రావడంతో మొదలైన ఈ ఉద్యమంతో... రాజకీయ, సాంస్కృతిక, వ్యాపార రంగాలకు చెందిన ఎందరో ప్రముఖుల లీలలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు నెలన్నర రోజుల్లో ఏకంగా 50 మంది ప్రముఖుల బాగోతాలు బయటపడ్డాయి. దీంతో వారిలో చాలా మంది తమ దుశ్చర్యల పర్యవసానాలను ఇప్పుడు అనుభవిస్తున్నారు. కొందరు ఉద్యోగాల నుంచి ఉద్వాసనకు గురికాగా.. మరికొందరు పదవులకు రాజీనామా చేస్తున్నారు. కొందరిపై కోర్టుల్లో కేసులు కూడా దాఖలవుతున్నాయి. 

ఎందరో ప్రముఖులు 
తాజాగా డెమోక్రటిక్‌ పార్టీ మినెసోటా సెనేటర్‌ అల్‌ ఫ్రాంకెన్‌ 2006లో తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని మాజీ మోడెల్‌ లియాన్‌ ట్వీడెన్‌ ఆరోపించారు. దీంతో ఆయన క్షమాపణ చెప్పారు. ఇక రిపబ్లికన్‌ పార్టీకి చెందిన రే మూర్‌ (70) 1970లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని, మరో ఇద్దరు టీనేజీ ఆడపిల్లల వెంటపడ్డారని గత వారం వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక ‘బాంబు’ పేల్చింది. ఆయన అలబామా రాష్ట్రం నుంచి సెనేటర్‌గా పోటీచేయడానికి సిద్ధమవుతుండగా ఈ విషయం బయటపడడంతో పోటీ ప్రశ్నార్థకంగా మారింది. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన ప్రముఖుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్‌ (సీనియర్‌), హాలీవుడ్‌ నటుడు డస్టిన్‌ హాఫ్‌మన్‌ (1985లో 17 ఏళ్ల అసిస్టెంట్‌ అనా గ్రహమ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ), 1990ల్లో అండర్‌ సీజ్‌ వంటి యాక్షన్‌ చిత్రాల హీరో స్టీవెన్‌ సీగల్, 1980ల్లో ఫస్ట్‌ బ్లడ్, రాకీ వంటి హాలీవుడ్‌ చిత్రాలతో సంచలనం సృష్టించిన కండల వీరుడు సిల్వస్టర్‌ స్టాలన్‌లు కూడా ఉన్నారు.    

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భౌతిక దూరం ఎనిమిది మీటర్లు? 

కరోనాతో ఆహార సంక్షోభం 

‘తబ్లిగి జమాత్‌’తో పెరిగిన కేసులు 

‘ఆపరేషన్‌ మర్కజ్‌’

జ‌మ్ముకశ్మీర్ : కేంద్రం మరో సంచలన నిర్ణయం

సినిమా

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా