కార్యాలయాల్లో మహిళలను వేధిస్తే ఇంటికే!

30 Jul, 2013 04:43 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆఫీసులు, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే ఖబడ్దార్! ఇకపై అలాంటివారిపై కఠిన చర్యలు తప్పవు. ఉద్యోగం కోల్పోవడంతోపాటు పదోన్నతుల నిలిపివేత, ఇంక్రిమెంట్లలో కోత, భారీ జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అనేక కఠిన చర్యలను ప్రతిపాదిస్తూ కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఒక ముసాయిదాను సిద్ధం చేసింది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధం, నిషేధం, పరిష్కార చట్టం-2013లో ఈ నిబంధనలను చేర్చనున్నారు. ఈ చట్టం ఫిబ్రవరి నుంచే అమల్లోకి వచ్చింది. తాజాగా మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ చట్టానికి పలు నిబంధనలను ప్రతిపాదించింది.

 

అయితే బాధితురాలు దురుద్దేశంతో ఫిర్యాదు చేసినా, విచారణ తర్వాత ఆరోపణలన్నీ అవాస్తవాలని తేలినా ఇవే కఠిన చర్యలను ఆమె ఎదుర్కోవాల్సి ఉంటుంది. చట్టాన్ని దుర్వినియోగపరిచేందుకు అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను చేర్చారు. లైంగిక వేధింపులపై వచ్చే ఆరోపణలను స్థానిక ఫిర్యాదుల కమిటీ విచారిస్తుంది. ఈ కమిటీలో సంబంధిత రంగంలో ఐదేళ్ల అనుభవం ఉన్న సామాజిక కార్యకర్త, కార్మిక, ఉద్యో గ, సివిల్, క్రిమినల్ చట్టాలు తెలిసిన నిపుణుడు సభ్యులుగా ఉండాలని ప్రతిపాదించారు. ఈ కమిటీకి.. సమీకృత శిశు సంరక్షణ పథకం కింద ఏర్పాటైన జిల్లా స్థాయి శిశు సంరక్షణ సంఘం ద్వారా సహాయం అందుతుంది.

మరిన్ని వార్తలు