ఢిల్లీ ఎయిర్‌పోర్టులో షా ఫైజల్‌ అడ్డగింత

14 Aug, 2019 15:34 IST|Sakshi

న్యూఢిల్లీ : మాజీ ఐఏఎస్‌ అధికారి, జమ్మూ కశ్మీర్‌ రాజకీయ నాయకుడు షా ఫైజల్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను తిరిగి శ్రీనగర్‌కు పంపించారు. ప్రస్తుతం ఆయనను గృహ నిర్బంధంలో ఉంచినట్లు తెలుస్తోంది. 2009లో సివిల్స్‌లో టాప్‌ ర్యాంక్‌ సాధించిన తొలి కశ్మీరీగా రికార్డు నెలకొల్పిన షా ఫైజల్‌.. గత జనవరిలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఫైజల్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈద్‌ సందర్భంగా ప్రతీ అవమానానికి బదులు తీర్చుకునే వరకు పండుగ జరపుకోబోనని ఆయన ట్వీట్‌ చేశారు.

అదే విధంగా మంగళవారం..‘ కశ్మీర్‌లో రాజకీయ హక్కులను కాపాడుకునేందుకు సుస్థిర, అహింసాయుతమైన, దీర్ఘకాలపు రాజకీయ ఉద్యమం రావాల్సి ఉంది. ఆర్టికల్‌ 370 రద్దు అయిన వెంటనే అంతా ముగిసిపోయింది. రాజ్యాంగవేత్తలు మాయమైపోయారు. ప్రస్తుతం ఇక్కడ ఒకరి కింద పనిచేస్తూ వారి చెప్పిందానికల్లా తలాడించడమో లేదా వేర్పాటువాదిగా ఉండటమో చేయాలి. ఇందులో దాయాల్సిందేమీ లేదు. ఎవరి నిర్ణయం వారిది’ అని ఫైజల్‌ ట్విటర్‌ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన ఇస్తాంబుల్‌ వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. దీంతో ఆయనను అడ్డుకున్న పోలీసులు జమ్మూ కశ్మీర్‌కు పంపించారు.

>
మరిన్ని వార్తలు