షహీన్‌బాగ్‌ షూటర్‌ ఆప్‌ సభ్యుడే

5 Feb, 2020 03:31 IST|Sakshi
ఇటీవల షహీన్‌బాగ్‌లో కాల్పులు జరిపిన వ్యక్తి ఆప్‌ కార్యకర్త అంటూ ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన ఫొటో

కోర్టుకు తెలిపిన పోలీసులు

దేశ భద్రతతో ఆప్‌ ఆడుకుంటోందన్న నడ్డా

ఆరోపణలను తోసిపుచ్చిన షూటర్‌ కుటుంబీకులు

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు జరుగుతున్న ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో గత వారం గాలిలో కాల్పులు జరిపిన కపిల్‌ బైసలా ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) సభ్యుడేనని మంగళవారం పోలీసులు కోర్టులో వెల్లడించారు. కపిల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, అందులోని వాట్సాప్‌ డేటాలో కపిల్‌ బైసలా, ఆయన తండ్రి ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరిననాటి ఫొటోలున్నాయన్నారు. ‘కపిల్, ఆయన తండ్రి 2019లో ఆప్‌లో చేరారు. ఆ సందర్భంగా దిగిన ఫొటోలు, వారిద్దరు స్థానిక ఆప్‌ నేతలతో దిగిన ఫొటోలు కపిల్‌ ఫోన్‌లో ఉన్నాయి’ అని డీసీపీ రాజేశ్‌ దియొ తెలిపారు. ఆ ఫొటోలను పోలీసులు మీడియాకు అందించారు. దీనిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు.

‘ఎన్నికల కన్నా, ప్రభుత్వం కన్నా.. దేశం, దేశ భద్రత ముఖ్యమైనవి. దేశ భద్రతతో ఆటలాడుకునే వారిని దేశం ఎన్నటికీ క్షమించదు. ఢిల్లీ ప్రజలు ఆప్‌కు ఈ ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తారు’ అని నడ్డా ట్వీట్‌ చేశారు. అయితే, పోలీసుల వాదనను కపిల్‌ బైసలా కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. వారి కుటుంబానికి ఆప్‌తో కానీ, వేరే ఏ రాజకీయ పార్టీతో కానీ ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ‘ఈ ఫొటోలు ఎక్కడి నుంచి, ఎలా వచ్చాయో నాకు తెలియదు. కపిల్‌కు కానీ, ఇతర కుటుంబ సభ్యులకు కానీ ఏ పార్టీతో సంబంధం లేదు. కపిల్‌ తండ్రి గజేసింగ్‌ 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వారు రాజకీయాలతో ఏ సంబంధం పెట్టుకోలేదు’ అని గజేసింగ్‌ సోదరుడు తెలిపారు. 
 

పెద్ద కుట్రలో భాగం  
షహీన్‌బాగ్‌ కాల్పుల ఘటన వెనుక పెద్ద కుట్ర ఉండి ఉండొచ్చని మంగళవారం పోలీసులు కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నాలుగు రోజుల పాటు నిందితుడైన కపిల్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ‘కాల్పుల ఘటన జరిగిన సమయం, ప్రదేశం.. ఇది మరో పెద్ద కుట్రలో భాగమన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆ కుట్రను ఛేదించాలి. వాట్సాప్‌లో వేర్వేరు గ్రూప్‌ల్లో కపిల్‌ సభ్యుడిగా ఉన్నాడు. ఆయా గ్రూప్‌ల్లోని ఇతర సభ్యులను, ఘటనాస్థలికి కపిల్‌తో పాటు వచ్చిన అతడి స్నేహితుడిని విచారించాల్సి ఉంది. అందుకు మరింత సమయం అవసరం’ అని కోర్టును పోలీసులు కోరారు. అయితే,  కపిల్‌ బైసలాను రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ గుర్‌మోహిన కౌర్‌ ఆదేశాలిచ్చారు. 

మరిన్ని వార్తలు