‘తాజ్‌మహల్‌ను షాజహాన్‌ మాకు రాసిచ్చారు’

11 Apr, 2018 10:05 IST|Sakshi
చారిత్రక కట్టడం తాజ్‌ మహల్‌ (పాత ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో ఏడో వింత, ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ను దాని నిర్మాత మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ తమకు రాసిచ్చారని ఉత్తరప్రదేశ్‌ సున్నీ వక్ఫ్‌ బోర్డు వాదిస్తోంది. ఈ మేరకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ)తో సుప్రీంకోర్టులో పోరాడుతోంది.

మంగళవారం సున్నీ వక్ఫ్‌ బోర్డు వాదనలు విన్న దేశ అత్యున్నత న్యాయస్థానం తాజ్‌మహల్‌ను షాజహాన్‌ సున్నీ బోర్డుకు రాసిచ్చిన పత్రాలను చూపాలని కోరింది. పత్రాలను కోర్టు ముందు ఉంచేందుకు వారం రోజుల పాటు గడువు ఇచ్చింది. భార్య ముంతాజ్‌పై తన ప్రేమకు గుర్తుగా షాజహాన్‌ తాజ్‌మహల్‌ను నిర్మించారు. 1658లో షాజహాన్‌ మరణించారు.

తాజ్‌మహల్‌ వక్ఫ్‌ బోర్డుకు చెందుతుందని షాజహాన్‌ చేసిన డిక్లరేషన్‌ కాకుండా మరే ఆధారాలు ఉన్నా కోర్టు ముందు ప్రవేశపెట్టాలని సున్నీ బోర్డుకు సుప్రీంకోర్టు సూచించింది. తాజ్‌మహల్‌ వక్ఫ్‌ బోర్డుకు చెందుతుందంటే భారతదేశంలో ఎవరు నమ్ముతారు? అంటూ సున్నీ బోర్డును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ప్రశ్నించారు. ఇలాంటి కేసుల వల్ల విలువైన కోర్టు సమయం వృథా అవుతోందన్నారు.

భారతదేశానికి స్వతంత్రం వచ్చిన అనంతరం తాజ్‌మహల్‌తో పాటు దేశ సాంస్కృతికను తెలియజెప్పే కట్టడాలను కాపాడే బాధ్యతను ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తీసుకుంది.

మరిన్ని వార్తలు