'ఆ' చట్టంలో శ్రీలంక తమిళులు ఎక్కడా?

21 Dec, 2019 14:54 IST|Sakshi
శరద్‌ పవార్(ఫైల్‌)

ముంబై: సవరించిన పౌరసత్వ చట్టం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు మాత్రమే ఎందుకు రూపొందించారని, శ్రీలంక తమిళులకు ఎందుకు వీలు కల్పించలేదని కేంద్ర ప్రభుత్వం తీరుపై ఎన్సీపీ చీఫ్ శరద్‌ పవార్ ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పౌరసత్వం సవరణ చట్టం (సీఏఏ), ప్రతిపాదిత జాతీయ పౌర గణాంక పట్టిక (ఎన్నార్సీలు) దేశాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే అని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

సీఏఏ, ఎన్నార్సీలను కేవలం మైనారిటీలే కాదు, దేశంలో ఏకత్వం(ఐక్యత), దేశ అభివృద్ధిని కాంక్షించే వారు కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పౌరసత్వ చట్టం సమాజంలో మతపరమైన ఇబ్బందులను సృష్టించడంతో పాటు దేశ ఐక్యత, సామరస్యాన్ని దెబ్బతీస్తుందని విమర్శించారు. సీఏఏ కేంద్రం తీసుకొచ్చిన చట్టం కావచ్చు, కానీ దాని అమలు రాష్ట్ర ప్రభుత్వాలచే చేయబడుతుందని అన్నారు. ఇప్పటికే ఈ చట్టాన్ని అమలు చేయడాన్ని బిహార్‌తో సహా ఎనిమిది రాష్ట్రాలు నిరాకరించాయి. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని అవలంబించాలని పవార్ పేర్కొన్నారు. 

సవరించిన చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్ నుంచి హింసేతర కారణల వల్ల భారత్‌కు వచ్చే ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడాన్ని తప్పుబడుతూ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు