‘చిన్నమ్మ’కు ఇక నో ఎంట్రీ

24 May, 2020 07:06 IST|Sakshi
పోయెస్‌గార్డెన్‌ నివాసం వద్ద చిన్నమ్మతో పార్టీ వర్గాలు (ఫైల్‌) 

వేదనిలయంతో తెగిన బంధం 

షెల్టర్‌ ఎక్కడో?

సాక్షి, చెన్నై: వేదనిలయంతో చిన్నమ్మ శశికళకు ఇక, బంధం తెగినట్టే. ఆ గృహాన్ని ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకోవడంతో, అటువైపు వెళ్ల లేని పరిస్థితి. ఈ దృష్ట్యా, చిన్నమ్మ కోసం మరో షెల్టర్‌ సిద్ధం చేయడానికి తగ్గ కసరత్తులపై అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు దృష్టి పెట్టారు. చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని దివంగత సీఎం, అమ్మ జయలలితకు చెందిన వేదనిలయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల చర్చలకు, ఎందరో ప్రతినిధులతో సంప్రదింపులు, భేటీలకు వేదికగా ఒకప్పుడు ఈ భవనం నిలిచింది. అమ్మ జయలలిత ఆశీర్వచనాల కోసం బారులు తీరిన వాళ్లు ఎందరో. (షూటింగ్‌లకు త్వరలోనే అనుమతి)

అయితే, ఇప్పుడు అమ్మ లేని దృష్ట్యా, ఆ పరిసరాలే నిర్మానుష్యం అయ్యాయి. అయితే, ఈ భవనంతో చిన్నమ్మ శశికళకు ప్రత్యేక అనుబంధమే ఉంది. జయలలిత నెచ్చెలిగా రెండున్నర దశాబ్దాలకు పైగా చిన్నమ్మ శశికళ ఈ భవనంలో ఉన్నారు. జయలలిత తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక చిన్నమ్మ హస్తం ఉండేది. ఈ ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు చిన్నమ్మకే ఎరుక. అమ్మ మరణం తర్వాత పరిణామాలతో చిన్నమ్మ శశికళ ఈ నివాసానికి నాయకిగా అవతరించినా, అమ్మకు దక్కిన గౌరవాన్ని ఈ నివాసం వేదికగా తనకు దక్కించుకున్నా, చివరకు అక్రమాస్తుల కేసు రూపంలో పరప్పన అగ్రహార చెరలో ఊచలు లెక్కించక తప్పలేదు.  (ఆగస్టులోగా అంతర్జాతీయ విమానాలు!)

ఇక అనుమతి లేనట్టే.. 
చిన్నమ్మ జైలు జీవితం తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందుకు కొనసాగింపుగా ప్రస్తుతం వేదనిలయంలోకి చిన్నమ్మ అడుగు పెట్ట లేని పరిస్థితి. ఈ నివాసాన్ని అమ్మ స్మారక మందిరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించినా, న్యాయ చిక్కులతో జాప్యం తప్పలేదు. ఎట్టకేలకు ప్రత్యేక చట్టం ద్వారా ఆ భవనాన్ని తన గుప్పెట్లోకి ప్రభుత్వం తీసుకుంది. ఈ దృష్ట్యా, ఇక, చిన్నమ్మ ఆ ఇంటి వైపుగా కన్నెత్తి చూడలేని పరిస్థితి. గతంలో ఓమారు పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో న్యాయ వివాదాల కారణంగా పోయెస్‌గార్డెన్‌కు చిన్నమ్మ వెళ్ల లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చెన్నైలోని తన బంధువు ఇంట్లో ఉండక తప్పలేదు. ఆమె జైలు జీవింతం ముగించి బయటకు రాగానే, పోయెస్‌గార్డెన్‌ మీదే గురి పెట్ట వచ్చన్న సంకేతాలు మొదటి నుంచి ఉంటున్నాయి.

మరికొన్ని నెలల్లో చిన్నమ్మ జైలు జీవితం ముగిసే అవకాశాలు ఉన్నాయి. 2021లో జైలు జీవితం ముగించి బయటకు వచ్చే చిన్నమ్మ గార్డెన్‌లోకి అడుగు పెట్టలేని రీతిలో నో ఎంట్రీ బోర్డుగా ఈ ప్రత్యేక చట్టానికి సంబంధించిన బోర్డును అక్కడ పెట్టడం గమనార్హం. ఈ చట్టానికి గవర్నర్‌ ఆమోదముద్ర వేయగానే, ఆ ఇంట్లో ఉన్న అన్ని రకాల వస్తువులు, స్థిర, చర ఆస్తుల్ని గుప్పెట్లోకి తీసుకుని వేద నిలయాన్ని అమ్మ స్మారకంగా మార్చేందుకు సీఎం పళనిస్వామి నేతృత్వంలోని ట్రస్టు పరుగులు తీస్తుండడం గమనార్హం. ఈ పరిణామాల దృష్ట్యా, చిన్నమ్మ కోసం కొత్త షెల్టర్‌పై అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం దృష్టి పెట్టింది. ఇప్పటికే చిన్నమ్మ ప్రతినిధిగా ఉన్న దినకరన్‌ అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగంకోసం రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయానికి కూత వేటు దూరంలో బ్రహ్మాండంగా భవనం తీర్చిదిద్దారు. ఈ దృష్ట్యా, చిన్నమ్మ కోసం పోయెస్‌గార్డెన్‌ పరిసరాల్లోనే మరో భవనం షెల్టర్‌ కోసం ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు