కేజ్రీవాల్‌ నిస్సహాయ ముఖ్యమంత్రి: శశి థరూర్‌

11 Jan, 2020 08:46 IST|Sakshi

ఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ ఆరోపించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన దాడిలో గాయపడిన విద్యార్థులను కలవడంలో కేజ్రీవాల్‌ విఫలమయ్యారని దుయ్యబట్టారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ ఒక నిస్సహాయ ముఖ్యమంత్రి అని విమర్శించారు. ఆదివారం జేఎన్‌యూలో మాస్కులు ధరించిన దుండగులు విద్యార్థులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ హింసాత్మక ఘటనలో విద్యార్థులు, ప్రొఫెసర్లకు గాయాలయ్యాయి. ‘బహుశా కేజ్రీవాల్‌ సీఏఏకు అనుకూలంగా, ప్రతికూలంగా ఉండాలనకుంటున్నారేమో. అందుకే దీనిపై బలమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారని, ఈ విషయం గురించి మాట్లాడకపోతే ఢిల్లీ ప్రజలు ఏ ప్రతిపాదికన ఆయనకు ఓటు వేయాలి. జేఎన్‌యూ దాడిపై స్పందించిన కేజ్రీవాల్‌ ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని కేంద్రం తనకు ఆదేశాలు జారీ చేసిందని అనడం విడ్డూరమని’ శశి థరూర్‌ అన్నారు.

‘ఆయన ఎవరి ఆదేశాలు స్వీకరిస్తున్నారో తెలియడం లేదు. దాడి విషయంపై మాట్లాడవద్దని, గాయపడిన విద్యార్థులను కలవవద్దని, సీఏఏపై సరైన నిర్ణయం తీసుకోవద్దని మిమ్మల్ని ఎవరు ఆదేశించారు? మీరు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఎవరూ ఆదేశించలేరు’ అని థరూర్‌ తెలిపారు. ఇటీవల పౌరసత్వ సవరణ చట్టంపై స్పందించిన కేజ్రీవాల్‌ ‘సీఏఏ తనకు పూర్తిగా అర్థం కాలేదని.. అమిత్‌ షా దీని గురించి ఎప్పుడు మాట్లాడుతారు. ఇళ్లు లేవు. మా పిల్లలకు ఉద్యోగాలు లేవు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్‌లో ఉన్న 2 కోట్ల మంది హిందువులకు పౌరసత్వం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది ఎంత వరకు కరెక్టు’ అని కేంద్రంపై ఆరోపణలు చేశారు. కాగా ఢిల్లీలో ఫిబ్రవరి 8న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

>
మరిన్ని వార్తలు