తప్పులో కాలేసిన శశిథరూర్‌.. ఆడుకుంటున్న నెటిజన్లు

24 Sep, 2019 12:33 IST|Sakshi

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో దేని గురించైనా చెప్పేటప్పుడు పూర్తి అవగాహనతో, సరైన సమాచారాన్ని మాత్రమే షేర్‌ చేయాలి. అలా కాకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడి, చేతికి దొరికిన ఫోటోను షేర్‌ చేస్తే.. ఆనక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించిన నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌. ఈయన సోషల్‌ మీడియాలో చాలా చురుకుగా ఉంటారనే విషయం తెలిసిందే. ఆంగ్ల భాషపై థరూర్‌కున్న పట్టు ఆమోఘం. కొత్త కొత్త పదాలతో ట్వీట్‌ చేస్తూ నెటిజనులను అలరిస్తుంటారు శశిథరూర్‌. అయితే  ప్రస్తుతం మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ఆయనకు లభిస్తున్న విశేష ఆదరణ గురించి బీజేపీ శ్రేణులు తెగ ప్రచారం చేస్తున్నాయి.

ఈ క్రమంలో దీనికి కౌంటర్‌ ఇచ్చేందుకు శశిథరూర్‌ చేసిన ప్రయత్నం కాస్త బెడిసి కొట్టింది. వివరాలు.. మాజీ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ రష్యా పర్యటన సందర్భంగా తీసిన ఫోటోని ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘1954లో మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇండియా గాంధీ యూఎస్‌ వెళ్లినప్పుడు తీసిన ఫోటో ఇది. ఇప్పుడున్నంత ప్రత్యేక పీఆర్‌ ప్రచారం, మీడియా పబ్లిసిటీ ఏమి లేని రోజుల్లోనే వారిని చూడటానికి ఎంతమంది అమెరికా ప్రజలు వచ్చారో చూడండి’ అంటూ ట్వీట్ చేశారు శశి థరూర్‌. ఈ ట్వీట్‌లో నెటిజన్లు రెండు తప్పిదాలను గుర్తించారు. ఒకటి ఇందిరా గాంధీ పేరును ఇండియా గాంధీగా పేర్కొన్నారు. రెండోది ఫోటోకు సంబంధించిన సమాచారం పూర్తిగా తప్పు. ఈ ఫోటోను 1956 మాస్కో పర్యటన సందర్భంగా తీసింది. ఈ తప్పులను గుర్తించిన నెటిజన్లు శశి థరూర్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు.
 

‘థరూర్‌ జీ ఇండియా గాంధీ ఎవరు’... ‘ఈ ఫోటో 1954 అమెరికాలో తీసింది కాదు.. రష్యా, మాస్కోలో 1956లో తీశారు’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఈ విమర్శలపై థరూర్‌ స్పందించారు. ‘ఈ ఫోటో అమెరికాలో తీసింది కాదు.. రష్యాలో తీసిందని నాకు తెలిసింది. మాజీ ప్రధానులకు విదేశాల్లో విశేష జనాదరణ ఉందని చెప్పడమే ఇక్కడ నా ప్రధాన ఉద్దేశం. మోదీని గౌరవిస్తున్నారు అంటే దేశాన్ని గౌరవిస్తున్నట్లే ’అంటూ మరో ట్వీట్‌ చేశారు థరూర్‌.
 

మరిన్ని వార్తలు