థరూర్‌కు ముందస్తు బెయిల్‌

6 Jul, 2018 03:06 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌కు ఊరట లభించింది. భార్య సునందా పుష్కర్‌ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు అరెస్ట్‌ చేయకుండా ఢిల్లీలోని ఓ న్యాయస్థానం ఆయనకు గురువారం ముందస్తు బెయిల్‌ మంజూరుచేసింది. ఈ సందర్భంగా థరూర్‌ విదేశాలకు పారిపోయే అవకాశముందన్న ప్రాసిక్యూషన్‌ వాదనల్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. అలాగే ఈ కేసులో సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు యత్నించరాదనీ, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని సూచించింది. 2014, జనవరి 17న ఢిల్లీలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో సునంద విగతజీవిగా కనిపించారు.

మరుసటి ఏడాది జనవరిలో కేసు నమోదుచేసిన పోలీసులు చివరికి దీన్ని ప్రత్యేక దర్యాప్తు బృందానికి(సిట్‌) అప్పగించారు. విచారణ చేపట్టిన సిట్‌ థరూర్‌ను నిందితుడిగా చేరుస్తూ కోర్టుకు చార్జ్‌షీట్‌ను సమర్పించింది. దీంతో జూలై 7లోగా తమ ముందు విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం థరూర్‌కు సమన్లు జారీచేసింది. ఈ కేసును గురువారం విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్‌ కుమార్‌.. శశిథరూర్‌కు ముందస్తు బెయిల్‌ను మంజూరుచేశారు. ఇందుకోసం రూ.లక్ష విలువైన వ్యక్తిగత బాండ్‌తో పాటు పూచీకత్తును సమర్పించాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు