కేంద్ర మంత్రిపై శశి థరూర్‌ ప్రశంసలు!

17 Apr, 2020 13:49 IST|Sakshi

ఆసక్తికరంగా శశి థరూర్‌, హర్షవర్ధన్‌ ట్విటర్‌ సంభాషణ

తిరువనంతపురం: కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్‌, ఆయన సహచర సిబ్బంది కఠిన పరిస్థితుల్లో ఎంతో గొప్పగా విధులు నిర్వర్తిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ శశి థరూర్‌ ప్రశంసలు కురిపించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న తిరువనంతపురం ఇకపై హాట్‌స్పాట్‌ లిస్టులో ఉండబోదని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన కేంద్రం ఏప్రిల్‌ 20 తర్వాత కొన్ని రంగాలకు నిబంధనలు సడలిస్తున్నట్లు పేర్కొంది. కరోనా ప్రభావం ఆధారంగా వివిధ జిల్లాలను జోన్ల వారీగా విభజించి అక్కడ చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసింది.(లాక్‌డౌన్‌ సడలింపు: కేరళ సీఎం కీలక నిర్ణయం)

ఈ నేపథ్యంలో కేరళలోని తిరువనంతపురం జిల్లాను కోవిడ్‌-19 హాట్‌స్పాట్‌గా గుర్తిస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయంపై స్పందించిన శశి థరూర్‌.. తిరునంతపురం కలెక్టర్‌ వెల్లడించిన కరోనా వివరాలను జోడించి.. ‘‘ఇంత గొప్ప రికార్డు ఉన్న తిరువనంతపురాన్ని ఎందుకు హాట్‌స్పాట్‌గా గుర్తించారు. ఈ విషయం గురించి స్పష్టతనివ్వగలరా’’అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ట్యాగ్‌ చేశారు. ఇక ఇందుకు స్పందించిన కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌... ‘‘ ఈనాటి వరకు 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు, 207 నాన్‌- హాట్‌స్పాట్‌, కరోనా లేని జిల్లాలను గుర్తించాం’’అంటూ హాట్‌స్పాట్‌ వర్గీకరణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. (ప్రతీకారం తప్పదు.. ఇలాంటి వాళ్లను చూడలేదు)

ఇందుకు ప్రతిగా ఆయనకు శశి థరూర్‌ ధన్యవాదాలు తెలపగా.. ‘‘ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకేమైనా వివరాలు కావాలంటే నన్ను సంప్రదించడానికి సందేహించకండి’’అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఏప్రిల్‌ 20 నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలు పాక్షికంగా సడలించనున్న నేపథ్యంలో బేసి- సరి విధానంలో వాహనాలను రోడ్ల మీదకు అనుమతించనున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్‌ పేర్కొన్నారు. అదే విధంగా కరోనా తీవ్రత ఆధారంగా జిల్లాలను నాలుగు జోన్లుగా విభజించనున్నామని వెల్లడించారు. ఈ క్రమంలో తిరువనంతపురాన్ని మూడో జోన్‌ కిందకు తెస్తామన్న విజయన్‌.. అక్కడ పాక్షికంగా లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు