ప్రతీకారం తప్పదు.. ఇలాంటి వాళ్లను చూడలేదు

7 Apr, 2020 12:17 IST|Sakshi

ట్రంప్‌పై శశి థరూర్‌ విమర్శలు

న్యూఢిల్లీ: మలేరియా యాంటీ డ్రగ్‌ హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను ఎగుమతి చేయకపోతే భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ శశి థరూర్‌ మండిపడ్డారు. భారత్‌ మందులు అమ్మాలని నిర్ణయించుకుంటేనే అమెరికాకు వాటి సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘‘ ఎన్నో దశాబ్దాల నా అనుభవంలో ఒక దేశాధినేత లేదా ప్రభుత్వం ఇలాంటి బెదిరింపులకు దిగడం ఎప్పుడూ చూడలేదు. ఇండియన్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మా సరఫరా అంటున్నారు కదా మిస్టర్‌ ప్రెసిడెంట్‌? భారత్‌ దానిని అమ్మాలని నిర్ణయించుకున్నపుడే అవి మీకు చేరతాయి’’అని శశి థరూర్‌ ట్వీట్‌ చేశారు.(అలా అయితే భారత్‌పై ప్రతీకారమే: ట్రంప్‌ )

కాగా శశి థరూర్‌ చాలా ఏళ్లపాటు ఐక్యరాజ్యసమితి అండర్‌ సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. కాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించడంలో మలేరియా వ్యాధిని అరికట్టే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ టాబ్లెట్ల వాడకం సత్ఫలితాలు చూపిస్తున్నాయన్న నేపథ్యంలో వాటిని ఎగుమతి చేయాల్సిందిగా అమెరికా భారత్‌ను కోరింది. అయితే భారత్‌లో కరోనా విస్తరిస్తున్న క్రమంలో వాటి ఎగుమతులను భారత్‌ నిషేధించింది.

ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. ఒకవేళ అమెరికా విషయంలో కూడా భారత్‌ ఇదే ధోరణి అవలంబిస్తే.. కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను కోవిడ్‌-19ను గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించిన ట్రంప్‌.. దాని అవసరం తమకు ఎంతగానో ఉందని.. వాణిజ్యపరంగా తమ నుంచి సహాయం పొందిన భారత్‌ సత్పంబంధాలు కొనసాగిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ క్రమంలో కరోనాతో అల్లకల్లోలం అవుతున్న దేశాలకు పారసిటమోల్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌లను సరఫరా చేస్తామని భారత ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.(ఆ దేశాలకు ఎగుమతి చేస్తాం: భారత్‌)

>
మరిన్ని వార్తలు