‘ఆయన గంగా నదిని అపవిత్రం చేశారు’

30 Jan, 2019 13:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ కుంభమేళాలో పవిత్ర స్నానం చేస్తున్న ఫోటోపై సీనియర్‌ కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సీఎం యోగి తన కేబినెట్‌ సహచరులతో కలిసి కుంభమేళాలో స్నానం చేసే ఫోటోను ట్వీట్‌ చేసిన శశి థరూర్‌ దానికి ఇచ్చిన క్యాప్షన్‌పై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

యోగి స్నానం చేసిన అనంతరం గంగా జలాలను శుద్ధిచేయాల్సిన అవసరం ఉందని, వారు చేసిన పాపాలు నది నుంచి కొట్టుకుపోవాలని థరూర్‌ వ్యాఖ్యానించారు. థరూర్‌ వ్యాఖ్యలను యూపీ మంత్రి సిద్ధార్థ్‌ నాథ్‌ సింగ్‌ తిప్పికొట్టారు. శశి థరూర్‌ తాను చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకునేందుకు గంగా నదిలో మునకేయాలని ఆయన సలహా ఇచ్చారు.

కుంభమేళా ప్రాధాన్యతను శశి థరూర్‌ సరైన రీతిలో అవగాహన చేసుకోలేదనేందుకు ఆయన వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయని మండిపడ్డారు. తన వ్యాఖ్యలు థరూర్‌ ఎలాంటి వాతావరణంలో పుట్టి పెరిగారో వెల్లడిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ‘మీరు చాలా తప్పులు చేశారు..వాటిని దిద్దుకునేందుకు కుంభ్‌లో పుణ్యస్నానం ఆచరించండి..మీ పాపాలను పోగొట్టుకోండి’అంటూ శశి థరూర్‌కు యూపీ మంత్రి హితవు పలికారు.

మరిన్ని వార్తలు