జైలు నుంచే చిన్నమ్మ మంత్రాంగం

19 Feb, 2017 08:50 IST|Sakshi
జైలు నుంచే చిన్నమ్మ మంత్రాంగం

రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్న శశికళ
ప్రత్యేక మార్గాల ద్వారా పార్టీ నేతలకు ఆదేశాలు


సాక్షి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్నాటకలోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు సమాచారం. జైలు నుంచే తమిళ రాజకీయాలను శాసించేలా తన వేగులను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన విధేయుడు ఎడప్పాడి పళనిస్వామి బల పరీక్ష సమాచారాన్ని శనివారం ఆమె ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా కొన్ని ప్రత్యేక మార్గాల ద్వారా జైలు నుంచే అన్నాడీఎంకే నేతలకు ఆదేశాలను జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

భద్రతపై అన్నాడీఎంకే నేతల సందేహాలు
శశికళ బుధవారం జైలుకు వెళ్లారు. మొదటి రోజు కాస్త ముభావంగా కనిపించిన ఆమె గురువారం నుంచి సాధారణంగానే వ్యవహరిస్తున్నారు. టిఫిన్, భోజనం కోసం అందరితోపాటే క్యూలో నిల్చుంటున్నారు. కాబోయే భర్తను ప్రియుడితో కలిసి చంపిన బెంగళూరు యువతి శుభా శంకర్‌నారాయణ్‌ గతంలో ఉన్న సెల్‌లోనే ప్రస్తుతం శశికళ ఉన్నారు. ఇక శశికళ ఉన్న సెల్‌ పక్కనే సైనెడ్‌తో ఏడుగురు మహిళలను చంపి, వారి ఆభరణాలు దోచుకెళ్లిన కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న సైనెడ్‌ మల్లిక ఉండటం గమనార్హం. దీంతో అన్నాడీఏంకే నేతలు శశికళ భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎ–క్లాస్‌ హోదా కోసం ప్రయత్నాలు
శశికళ వయసు, ఆరోగ్యం దృష్ట్యా ఎ–క్లాస్‌ ఖైదీ హోదా ఇవ్వాలని ఆమె తరఫు లాయర్‌ ఎస్‌ఎన్‌డీ కులశేఖర్‌ కోరుతున్నారు. దీనిపై సంబంధిత పత్రాలను త్వరలో జైళ్లశాఖ అధికారులకు అందజేయనున్నారు. ఈ విషయమై పరప్పణ జైలు సూపరింటెండెంట్‌ కె.కృష్ణకుమార్‌ మాట్లాడుతూ.. ‘‘శశికళకు ఎ–క్లాస్‌ హోదా అంశంపై ఇప్పటిదాకా మాకు ఎలాంటి అభ్యర్థన రాలేదు. అభ్యర్థన వస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పారు. ఖైదీకి ఎ–క్లాస్‌ హోదా ఉంటే ప్రత్యేక గది, టీవీ, ఫ్యాన్, మంచం, పరుపు వంటి సౌకర్యాలు లభిస్తాయి. గదిలోకే దినపత్రికలు తెప్పించుకోవచ్చు. బయటి నుంచి ఆహారం కూడా తెప్పించుకోవచ్చు. ఇదిలా ఉండగా భద్రతా కారణాలను చూపుతూ చిన్నమ్మను పరప్పణ జైలు నుంచి తమిళనాడుకు మార్చే అంశంపై ఆమె తరఫు లాయర్లు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. తమిళనాడు సీఎం పళనిస్వామి ఏ క్షణమైనా శశికళను కలవడానికి రావచ్చని ప్రచారం సాగుతోంది.