శశికళ x శశికళ పుష్ప

30 Dec, 2016 02:07 IST|Sakshi
శశికళ x శశికళ పుష్ప

- ప్రధాన కార్యదర్శి శశికళకు పుష్ప నుంచి సవాలు
- జయ మరణం వెనుక మిస్టరీపై సీబీఐ విచారణకు పట్టు
- పార్టీ పదవికి శశికళ అర్హురాలు కాదని.. ఆ పదవికి పోటీ చేస్తానని ప్రకటన
- నామినేషన్‌ పత్రాల కోసం పార్టీ ఆఫీస్‌కు వెళ్లిన ఆమె భర్తపై పార్టీ శ్రేణుల దాడి  

సాక్షి ప్రతినిధి, చెన్నై:  అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన శశికళకు అదే పార్టీకి చెందిన బహిష్కృతనేత, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పతో సవాళ్లు తప్పేట్లుగా లేవు. ఇరువురి మధ్య రాజకీయ చిచ్చు రగులుతోంది. ఒకప్పుడు జయలలిత ప్రాపకం సంపాదించిన శశికళ పుష్ప.. ఆ తరువాత ఆమె ఆగ్రహాన్ని చవిచూశారు. రాజ్యసభ సభ్యురాలుగా ఎంపికైన ఆమె చివరకు అవమానకర రీతిలో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇందుకు శశికళే కారణమని రగిలిపోతున్న పుష్ప.. ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఒప్పుకునేది లేదని ప్రకటిస్తున్నారు.

పుష్ప రాజకీయ ప్రస్థానమిలా..
1976 మే 22న తూత్తుకూడిలో జన్మించిన శశికళ పుష్ప 2011–14 మధ్య కాలంలో తూత్తుకూడి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా పనిచేశారు. మొదటినుంచీ అన్నాడీఎంకేకు విశ్వాసపాత్రురాలు కావడంతో 2014లో జయలలిత ఆమెను రాజ్యసభ సభ్యురాలిని చేశారు. అన్నాడీఎంకేలో ఉంటూ డీఎంకే ఎంపీ తిరుచ్చి శివతో ఆమె స్నేహంగా ఉంటున్నట్లు జయలలిత అనుమానించారు. చిన్న తప్పును సైతం క్షమించే అలవాటులేని జయలలిత.. శశికళ పుష్పను పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. తన అనుయూయుల ద్వారా రహస్యంగా ఈ సమాచారం అందుకున్న శశికళ పుష్ప తనకు, తిరుచ్చి శివకు మధ్య స్నేహం లేదని నిరూపించుకునేందుకు ఈ ఏడాది జూలై 30న ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అందరూ చూస్తుండగా ఆయన చెంపపై కొట్టారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన జయలలిత ఆగస్టులో శశికళ పుష్పను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

ఇదంతా శశికళ కుట్రగా పుష్ప ధ్వజం
అయితే ఇదంతా జయ నెచ్చెలి శశికళ తనపై చేస్తున్న కుట్రగా శశికళ పుష్ప ధ్వజమెత్తారు. శశికళ తనను మంచిగా పోయెస్‌గార్డెన్‌కు పిలిపించుకుని బలవంతంగా తెల్లకాగితంపై సంతకం తీసుకున్నారని, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని సైతం ఆమె బెదిరించినట్లుగా పుష్ప ఆరోపించారు. ఇద్దరు శశికళల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్న నెలరోజుల్లోనే జయలలిత అస్వస్థతకు గురికావడం, మరణించడం జరిగిపోయింది. శశికళపై అప్పటికే ఆగ్రహంతో ఉన్న శశికళ పుష్ప.. జయలలిత మరణం వెనుకనున్న మిస్టరీని సీబీఐ విచారణ జరిపించడం ద్వారా వెలికితీయాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ అర్హురాలు కాదంటూ ధ్వజమెత్తడమేగాక తాను ఆ పదవికి పోటీచేయనున్నట్లు ప్రకటించారు.

నామినేషన్‌ పత్రాలకోసం ఈనెల 28న అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి వెళ్లిన శశికళ పుష్ప భర్త లింగేశ్వరన్‌ తిలకన్‌పై పార్టీ శ్రేణులు తీవ్రంగా దాడిచేసి గాయపరిచాయి. అంతేగాక గురువారం నాటి సర్వసభ్య సమావేశానికి హాజరుకాకుండా లింగేశ్వరన్‌ను పోలీసులు రహస్యప్రదేశంలో దాచిపెట్టారు. అన్నాడీఎంకే కార్యాలయానికి వెళ్లిన తన భర్త ఆచూకీ తెలియట్లేదని పుష్ప హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో పోలీసులు గురువారం సాయంత్రం అంటే అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ముగిశాక విడిచిపెట్టారు. ఇలాంటి అనేక పరిణామాలతో శశికళ, శశికళ పుష్ప మధ్య రాజకీయ చిచ్చు రగులుతోంది.

మరిన్ని వార్తలు