కోవింద్‌ మంచి వ్యక్తే, కానీ...

5 May, 2018 08:50 IST|Sakshi
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (పాత చిత్రం)

సాక్షి, ముంబై: నేషనల్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం పెట్టిన చిచ్చు ఇప్పట్లో ఆరేలా కనిపించటం లేదు. విజేతలందరికీ రాష్ట్రపతి అవార్డులు ఇవ్వకపోవటంపై యావత్‌ సినీ పరిశ్రమ అసంతృప్తితో ఉంది. విషయం ముందుగా తెలియటంతో సుమారు 60 మంది విజేతలు కార్యక్రమాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారంపై వెటరన్‌ నటుడు, బీజేపీ సీనియర్‌ నేత శతృఘ్నసిన్హా తనదైన శైలిలో స్పందించారు. శుక్రవారం ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ...

‘రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు. గతంలో ఆయన బిహార్‌ గవర్నర్‌గా పని చేసిన సమయంలో చాలా దగ్గరగా చూశాను. ఆయన చాలా మంచి వ్యక్తి. కానీ, ఇలా జరగాల్సింది కాదు. ఎక్కడో పొరపాటు జరగటంతో కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. కానీ, ఇలా జరగాల్సింది కాదు. నటులు అంటే దేశ గౌరవానికి ప్రతీకలు. అలాంటి వారిని అవమానించటం మంచి పద్ధతి కాదు’ అని సిన్హా తెలిపారు.

‘రాష్ట్రపతి చేతుల మీదుగా ఇవ్వాల్సిన అవార్డులను వేరే ఎవరో ఇవ్వటం సరైంది కాదు. అలాగని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని నేను తక్కువ చేయడం లేదు(మిగతా అవార్డులు ఆమె ప్రదానం చేశారు). ఆమె మంచి నేత. కానీ, ఈ అవార్డులను ఆమె ఇవ్వటాన్ని నేను అంగీకరించను. భోజనానికి పిలిచి ఒకరికి ఒకరకమైన భోజనాన్ని.. మరొకరికి ఒకరకమైన భోజనాన్ని పెడితే ఎలా ఉంటుంది? ఈ వ్యవహారం కూడా అలాగే ఉంది. గతంలో రాష్ట్రపతులంతా చాలా ఓపికగా అవార్డులను ఇచ్చారు. మహిళ అయి ఉండి కూడా ప్రతిభా పాటిల్‌ మినహాయింపు తీసుకోలేదు. కానీ, కోవింద్‌ మాత్రం ఎందుకు ఆ సంప్రదాయాన్ని పాటించలేదో అర్థం కావట్లేద’ని శతృఘ్నసిన్హా ఆక్షేపించారు.

ఇదిలా ఉంటే జరిగిన పరిణామాలపై రాష్ట్రపతి కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్చి నెల నుంచే తాము ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి(సాంకేతిక మరియు సమాచార మంత్రిత్వ శాఖ) సమాచారం అందిస్తూ వస్తున్నామని, అయిన విషయాన్ని గోప్యంగా ఉంచి చివరి నిమిషంలో వెల్లడించటంతో ఈ వివాదం చెలరేగిందని పేర్కొంటూ ఓ లేఖను రాష్ట్రపతి కార్యాలయం కేంద్రానికి రాసింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా