ఆ జనసంద్రాన్ని చూడండి: మాజీ ఎంపీ

17 Jul, 2020 17:15 IST|Sakshi

పట్నా: బిహార్‌లో కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి ప్రభావిత రాష్ట్రాల్లో బిహార్‌ రెండోస్థానంలో ఉందంటూ ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ ది లాన్సెట్ అధ్యయనం తాజాగా వెల్లడించిన విషయం తెలిసిందే. పరిశుభ్రత, ఆరోగ‍్య వ్యవస్థ లాంటి అనేక కీలక సూచికలను పరిగణనలోకి తీసుకొని ఈ అంచనాకు వచ్చినట్టు అధ్యయనం పేర్కొంది. ఇలాంటి తరుణంలో బిహార్‌లోని ఆస్పత్రుల నిర్వహణ తీరుకు అద్దం పట్టే వీడియో ఒకటి చర్చనీయాశంగా మారింది. రాష్ట్రంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోని ఔట్‌పేషెంట్‌ విభాగంలో వందలాది మంది ఒకేచోట గుమిగూడి.. సహాయం కోసం వేచి చూస్తున్న వీడియోను మాజీ ఎంపీ శత్రుఘ్ఞ సిన్హా ట్విటర్‌లో షేర్‌ చేశారు. కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న తరుణంలో లాక్‌డౌన్‌ విధించడం ఒక్కటే సరైన పరిష్కారం కాదని, సామాజిక దూరం నిబంధనలు పాటించేలా ప్రజలకు సరైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని విమర్శించారు. (కరోనా: అత్యంత ప్రమాదకర జిల్లాల రాష్ట్రాలివే!)

‘‘భీతావహం! భయంకరం! ఈ వైరల్‌ వీడియో పట్నాలోని ప్రముఖ ఆస్పత్రికి సంబంధించినది. దీన్నేమనాలి అసలు? చాలా విచారకరం. బిహార్‌ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. నేను ఎవరినీ తప్పుబట్టాలనుకోవడం లేదు. అయితే మహమ్మారి విజృంభిస్తున్న ఇలాంటి తరుణంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం ఏంటి? ఓపీడీలో ఆ జనసంద్రాన్ని చూడండి. నిబంధనలు ఏమైపోయాయి? ఇలాంటి సమయాల్లోనే ఎక్కువ మందికి వైరస్‌ సంక్రమించే అవకాశం ఉంది. వారితో పాటు పేషెంట్లకు కూడా ప్రమాదమే. రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం నితీశ్‌ కుమార్‌ తగిన చర్యలు తీసుకోవాలి’’ అని శత్రుఘ్ఞ సిన్హా విజ్ఞప్తి చేశారు. కాగా క‌రోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్న నేప‌థ్యంలో జూలై 16నుంచి 31 వ‌ర‌కు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు బిహార్‌ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.(బిహార్‌ రాజ్‌భ‌వ‌న్‌కు క‌రోనా సెగ‌)

మరిన్ని వార్తలు