'ఆయన అడగడంతో కాదనలేకపోయా'

6 Jan, 2016 16:35 IST|Sakshi
'ఆయన అడగడంతో కాదనలేకపోయా'

న్యూఢిల్లీ: రాజేశ్‌ ఖన్నాపై 1991లో పోటీ చేయడం తనకు తీవ్ర విచారం కలిగించిన అంశమని బాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ శత్రుఘ్నసిన్హా వెల్లడించారు. ఈ విషయంలో ఆయనకు క్షమాపణ చెప్పానని తెలిపారు. రాజేశ్ ఖన్నా మూడేళ్ల క్రితం మరణించారు.

'ఉప ఎన్నికలో పోటీ చేయడంతో నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. పోటీ చేయాలని ఎల్ కే అద్వానీ కోరడంతో కాదనలేకపోయాను. ఎందుకంటే అద్వానీ నాకు మార్గదర్శకుడు, గురువు. ఆయన గొప్ప నాయకుడు' అని శత్రుఘ్నసిన్హా అన్నారు. 1991 సాధారణ ఎన్నికల్లో గాంధీనగర్, ఢిల్లీ లోక్ సభ స్థానాల్లో పోటీ చేసి అద్వానీ విజయం సాధించారు. తర్వాత ఆయన ఢిల్లీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ తరపున రాజేశ్ ఖన్నా, బీజేపీ తరపున శత్రుఘ్నసిన్హా పోటీ చేశారు. రాజేశ్‌ ఖన్నా చేతిలో శత్రుఘ్నసిన్హా ఓడిపోయారు.

'తొలిసారి పోటీ చేసి ఓడిపోవడంతో చాలా బాధ పడ్డాను. నిజంగా ఏడ్చినంత పనిచేశాను. అద్వానీ ఒక్క రోజు కూడా ఎన్నికల ప్రచారం చేయకపోవడం నన్ను మరింత బాధించింది' అని ఆత్మకథలో శత్రుఘ్నసిన్హా పేర్కొన్నారు. 'ఎనీథింగ్ బట్ ఖామోష్' పేరుతో రాసిన శత్రుఘ్నసిన్హా ఆత్మకథ రాశారు. బుధవారం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.
 

మరిన్ని వార్తలు