ఆ అమ్మ 40 ఏళ్లకు మళ్లీ వచ్చింది..

8 Jan, 2017 01:03 IST|Sakshi
ఆ అమ్మ 40 ఏళ్లకు మళ్లీ వచ్చింది..

చనిపోయిందనుకుని గంగా నదిలో వదిలేసిన తమ తల్లి తిరిగి 40 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమయ్యేసరికి ఇద్దరు మహిళలు అవాక్కయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. 1976లో 42ఏళ్ల విలాసా అనే మహిళ పొలంలో నల్లత్రాచు పాము కాటుకు గురై స్పృహతప్పి పడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు నాటు వైద్యుని వద్దకు తీసుకెళ్లి వైద్యం అందించారు. కానీ ఆ వైద్యం పనిచేయలేదు. విలాసా కోమాలోకి వెళ్లిపోయింది. దీంతో తమ తల్లి మరణించిందని భావించిన సదరు మహిళలు తమ ఆచారం ప్రకారం పొత్తి గుడ్డలో చుట్టి తెరిచిఉన్న పెట్టెలో విలాసాను ఉంచి గంగానదిలో విడిచిపెట్టారు. అలా చేయడం వల్ల మనిషి దేహంలో ఏదైనా విషం ఉంటే గంగానది వద్దకు తీసుకుని తమ వారిని తిరిగి తమ వద్దకు చేరుస్తుందని అప్పట్లో ప్రజలు నమ్మేవారు.

నదిలో కొట్టుకు పోతున్న ఆమెను రామసరన్‌ అనే వ్యక్తి కాపాడి వైద్యం అందించాడు. అయితే ఆమె స్పృహలోకి వచ్చినప్పటికీ గతం మాత్రం మరచిపోయింది. దీంతో కొన్నేళ్లుగా అక్కడే వారితో పాటే ఉండిపోయింది. కాగా ఇటీవల ఆమెకు ఆశ్చర్యకరంగా గతం గుర్తుకు వచ్చింది. ఆమె చెప్పిన విషయాలను విశ్వసించి, వివరాలు సేకరించారు. అనంతరం సొంత గ్రామానికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులతో కలిపారు. పుట్టుమచ్చల ఆధారంగా విలాస కుమార్తెలు రామకుమారి, మున్నీ గుర్తించారు. దాదాపుగా 40 ఏళ్ల అనంతరం తల్లి దగ్గరకి రావడంతో వారి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి.

>
మరిన్ని వార్తలు