ఆమె లేదు.. ఆమె కళ్లు ఉన్నాయి!

13 Jul, 2016 13:51 IST|Sakshi
సుతాప బోస్ (ఫైల్)

కోల్కతా: పుట్టెడు విషాదంలోనూ తోటివారికి సహాయం చేయాలని భావించింది ఆ కుటుంబం. తమకు వచ్చిన కష్టం మరొకరికి రాకూదన్న ఉద్దేశంతో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. కోల్కతాకు చెందిన సుతాప బోస్ అనే 36 ఏళ్ల మహిళ మంగళవారం కన్నుమూశారు. ఆమె అవయవాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే సమయం మించిపోవడంతో ఆమె అవయవాలు పనికిరాకుండా పోయాయి. ఆమె కళ్ల నుంచి కార్నియాలను మాత్రం వైద్యులు సేకరించారు. వీటితో ఇద్దరికి చూపు ప్రసాదించనున్నారు. పుట్టెడు బాధలోనూ పరులు కోసం ఆలోచించిన సుతాప కుటుంబ సభ్యులను చెమర్చిన కళ్లతోనే అభినందిస్తున్నారు.

సుతాప రెండు కిడ్నీలు పాడైనట్టు ఏడాదిన్నర క్రితం డాక్టర్లు గుర్తించారు. ఆమెకు మూత్రపిండ్రం అమర్చాలని వైద్యులు సూచించారు. అప్పటి నుంచి డయాలసిస్ చేయించుకుంటూ అవయవదాత కోసం ఆమె ఎదురు చూశారు. సుతాప కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఆమెకు కిడ్నీ దొరకలేదు. బిరతిలో తన తండ్రి నివాసంలో ఉండగా గుండెపోటు రావడంతో సుతాప మంగళవారం కన్నుమూశారు. అంత బాధలోనూ సుతాప కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను దానం చేయాలనుకోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని డాక్టర్ ప్రతిమ్ సేన్గుప్తా చెప్పారు. సుతాపకు భర్త అమితాబ, ఐదేళ్ల కుమార్తె శ్రేష్ట ఉన్నారు.

మరిన్ని వార్తలు