ఏది మంచి.., ఏది చెడు..?

27 Sep, 2016 18:09 IST|Sakshi
ఏది మంచి.., ఏది చెడు..?

ముంబైః పెరిగే వయసులో ఆమె తీవ్రమైన వివక్ష ఎదుర్కొంది. ప్రతి విషయం తన ఇష్టానికి వ్యతిరేకంగానే జరిగింది. అయితే ఆమె అధైర్య పడలేదు. ఎదురైన ప్రతి కష్టాన్ని ధైర్యంగా మార్చుకుంది.  పెరిగిన స్థలం, ప్రాంతం, చర్మ రంగులపై ఎదురైన విమర్శలను ఆత్మవిశ్వాసంగా మలచుకుంది. 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' ఫేస్ బుక్ పేజీలో తన జీవిత వివరాలతో ఆమె ఇచ్చిన వివరణ ఎందరికో స్ఫూర్తినిస్తుంది. ప్రతి బాలికా  తన భవిష్యత్తును నిర్మించుకునే ధైర్యాన్ని కలిగిస్తుంది.

అతి పురాతన మైన, ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ జిల్లాల్లో ఒకటిగా పేరొందిన ప్రాంతం ముంబైలోని  కామాటిపుర. ఆ యువతి అక్కడే పుట్టి పెరిగింది. సాధారణ మహిళలకే సమస్యలు ఎదురయ్యే మన సమాజంలో... ఆ ప్రాంతంలో పుట్టి.. తన జీవన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది.  అనేక రకాలైన వివక్షలు వ్యతిరేకతలను చవి చూసింది. ఆమె జీవిత విశేషాలు భవిష్యత్తులో ప్రతి బాలికకూ ఓ జీవిత పాఠంగా మారాలని ఆశిస్తోంది. పాఠశాల వయసులో తన చర్మపు రంగును చూసి ఆటపట్టించడం,  పదేళ్ళ వయసులోనే ఓ టీచర్ తనపై అత్యాచారానికి పాల్పడటం వంటి ఎన్నో విషయాలను ఆమె తన పేజీలో వివరించింది. మన విద్యా వ్యవస్థను ఆమె తీవ్రంగా తప్పుబట్టింది. పాఠశాల వయసులో ఏది మంచి స్పర్శ, ఏది చెడు స్పర్శ తెలుసుకునే అవకాశం మన విద్యా విధానంలో లేదని, దాంతో తాను 16 సంవత్సరాల వయసు వచ్చి, విషయాలను అర్థం చేసుకునే వరకూ తనపై జరిగిన మానభంగం విషయాన్ని ఇతరులకు చెప్పేందుకు తీవ్రంగా భయపడ్డానంటూ 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' ఫేస్ బుక్ పేజీలో రాసింది.

ప్రస్తుతం ఏది మంచి ప్పర్శ, ఏది చెడు స్మర్శ అనే విషయాలతోపాటు ఋతుస్రావం, సెక్స్ వంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు ఆమె నడుం బిగించింది. అందుకోసం ఓ వీధినాటక సమూహంలో చేరినట్లు తెలిపింది. తాను చేస్తున్న ప్రయత్నంలో సెక్స్ అనే పదం ముంబై పోలీసులకు సైతం ఆగ్రహం తెప్పించిందని చెప్పింది. తాము నివసించే ప్రాంతం ప్రత్యేకంగా పరిగణించడంతో అక్కడి బాలికలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,  అక్కడ భవిష్యత్తులో తమ కుమార్తెలు, ఇతర బాలికలు అత్యాచార బాధితురాలు కాకూడదన్నదే తన ఆశయమని చెప్పింది. స్థానిక ఎన్జీవో సంస్థ క్రాంతి సాయంతో శాన్ ఫ్రాన్సిస్కో లో జరిగిన  'గర్ట్ ఆన్ ది రన్' కార్యక్రమంలో సైతం పాల్తొన్నట్లు తన పేజీలో ప్రస్తావించింది. కామాటిపుర ప్రాంతంలో నివసిస్తున్నట్లు చెప్పుకునేందుకు ఏ మాత్రం సిగ్గు పడాల్సిన అవసరం లేదని, ప్రతి సమస్యను దీటుగా ఎదుర్కొని, అవగాహనతో ప్రతి బాలికా ఎదగాలని ఆమె ఆకాంక్షిస్తోంది.

మరిన్ని వార్తలు