100 రోజుల్లో.. కశ్మీర్‌ టూ కన్యాకుమారికి పరుగు

19 Jun, 2019 10:23 IST|Sakshi
సుఫియా సుఫి

న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాలో వ్యాప్తి చెందుతున్న విద్వేశం ఆగాలని, మనమంతా ఒక్కటేననే భావనలో జీవించాలని కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఓ మారథన్‌ రన్నర్‌  ‘యూనిక్‌ మిషన్‌’ పరుగును మొదలు పెట్టింది. ఢిల్లీకి చెందిన 33 ఏళ్ల  సుఫియా సుఫి.. 11 రాష్ట్రాలు, 25 నగరాలు, వేలాది గ్రామాల మీదుగా 100 రోజుల్లో పరుగును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యలో గాయం మూడు రోజులపాటు ఆమెను ఇబ్బంది పెట్టినా ఆమె సంకల్పం ముందు చిన్నబోయింది. ఏప్రిల్‌ 25న తన పరుగును ప్రారంభించిన సుఫియా.. జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్టాల్లో తన పరుగును పూర్తి చేసుకుని ముంబైకి చేరింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతమైన విద్వేశం వ్యాప్తి చెందుతుంది. నా పరుగు దానికి కౌంటర్‌గా ఉంటుందని భావిస్తున్నాను. మనుష్యులంతా మానవత్వం, ఏకత్వం, శాంతి, సమానత్వంతో జీవించడమే నాకు కావాలి.’  అని తెలిపింది.  ఇప్పటి వరకు తన సొంత డబ్బులనే ఈ మిషన్‌కు ఉపయోగించానని తెలిపిన ఆమె.. ప్రస్తుతం క్రౌడ్‌ ఫండింగ్‌ చేస్తున్నట్లు పేర్కొంది.

లిమ్కారికార్డు హోల్డర్‌ అయిన సుఫియా.. 15 రోజుల్లో 720 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసుకోని ఈ ఘనతను అందుకుంది. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కోసం పరుగును ప్రారంభించిన ఆమె.. ప్రస్తుతం అదే పిచ్చిగా జీవిస్తోంది.  ఏయిర్‌ ఇండియాలో ఉద్యోగం వదిలేసి మరి పరుగెత్తుతోంది. తన ’యూనిక్‌ మిషన్‌’  మధ్యలో గాయంతో సుఫియా ఆసుపత్రిలో చేరడంతో ఆమె పరుగు 3 రోజులు ఆగింది. ‘ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఈ మిషన్‌ ఎలా పూర్తి చేస్తాననే ఆందోళన కలిగింది. నేను పరుగుత్తుతున్న రూట్‌లో చాలా ట్రాఫిక్‌ ఉంటుంది. ఇదే నా అనారోగ్యానికి కారణం. కానీ నేను వెంటనే కోలుకుని నా పరుగును అందుకున్నాను. మరి కొద్ది రోజుల్లోనే నా మిషన్‌ పూర్తి చేస్తాను’ అని ధీమా వ్యక్తం చేసింది. ఇక సుఫియా తన లక్ష్యాన్ని చేరుకోవాలని మనం కూడా ఆశిస్తూ.. ఆల్‌దిబెస్ట్‌ చెబుదాం. 
 

మరిన్ని వార్తలు